ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) కరేబియన్ దేశం గయానాను సందర్శిస్తున్నారు.చారిత్రకంగా, సాంస్కృతికంగా, వ్యూహాత్మకంగా గయానా మన దేశానికి అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు.గయానా జనాభాలో దాదాపు 40 శాతం భారతీయ మూలాలకు చెందినవారే కావడం గమనార్హం.19వ శతాబ్ధంలో బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన భారతీయ కార్మికుల సంతతే వీరంతా.దశాబ్ధాలుగా వీరు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భాషను సంరక్షించడమే కాకుండా గయానా ఆర్ధికాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
1968లో ఇందిరా గాంధీ తర్వాత ఓ భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి.ఇండో – కరేబియన్ ( Indo-Caribbean )సంబంధాలపై ఇది మరోసారి దృష్టి సారించింది.గ్లోబల్ సౌత్‌తో భారతదేశ విస్తృత సంబంధాల్లో గయానా ప్రాముఖ్యతను మోడీ తాజా పర్యటన నొక్కి చెబుతోంది.
విస్తారమైన చమురు, గ్యాస్ నిల్వల ఆవిష్కరణ సహా వేగవంతమైన ఆర్ధికాభివృద్ధి కారణంగా గయానాతో సహకారాన్ని భారత్ కోరుకుంటోంది.
సాంస్కృతిక దౌత్యం, స్థానిక భారతీయ కమ్యూనిటీతో మోడీ ఆత్మీయ సమ్మేళనం, గయానా పార్లమెంట్‌లో ఆయన చేసిన ప్రసంగం తదితర అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఇదే సమయంలో గయానా ప్రభుత్వం మోడీకి తన అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ’’ .మరో కరేబియన్ దేశం బార్బడోస్ తన ‘‘ హానరరి ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ ’’ని ప్రదానం చేశాయి.ఇప్పటికే కోవిడ్ సమయంలో తమను ఆదుకున్నందుకు కృతజ్ఞతగా డొమినికా ప్రభుత్వం( Government of Dominica ) మోడీకి తన అత్యున్నత జాతీయ అవార్డ్ ‘‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ ’’ను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.
గయానా పర్యటనలో భాగంగా బుధవారం ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో( Mohammad Irfan Ali ) సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 10 రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి.హైడ్రో కార్బన్స్, వాణిజ్యం, రక్షణ , చెల్లింపు వ్యవస్ధలు, ఇంధనం, ఫార్మా, అగ్రికల్చరల్ వంటి రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగినట్లుగా తెలుస్తోంది.