మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు.అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు వుంటాడు.
కానీ ఆ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలో విద్యనభ్యసించినప్పుడే.ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ.
తన భవిష్యత్తుకు ఆయన అనుభవాన్ని వారధిగా చేసుకుని ముందుకు సాగుతాడు.జీవితంలో ఎవరికీ కేటాయించనంత సమయాన్ని గురువు వద్ద గడుపుతాడు.
ఈ క్రమంలో అత్యుత్తమ ఉపాధ్యాయులుగా జనం నీరాజనాలు అందుకున్న వారు ఎందరో.
తాజాగా ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పడంతో పాటు సంఘసంస్కర్తగా దురాచారాలను రూపుమాపిన మహారాష్ట్రకు చెందిన ప్రాథమిక పాఠశాల టీచర్ రంజిత్ సిన్హ్ దిసాలేను ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్-2020’ను వరించింది.దీని కింద ఆయన 1 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 7.38 కోట్ల రూపాయలు) నగదు బహుమతి అందుకోనున్నారు.వృత్తిలో అత్యుత్తమంగా నిలిచిన వారికి వర్కే ఫౌండేషన్ ఏటా ఈ అవార్డును అందజేస్తుంది.లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో గురువారం ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది.ఈ పోటీలో 140 దేశాల నుంచి మొత్తం 12 వేలకు పైగా నామినేషన్లు దాఖలవ్వగా.తుది వడపోతలో మొత్తం పది మంది నిలిచారు.ఈ లిస్ట్‌లో రంజిత్ గెలుపొందినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు ప్రకటించారు.
ఇదీ ప్రస్థానం:

సోలాపూర్ జిల్లా పరిదేవాడికి చెందిన జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రంజిత్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.ఓ పక్క గోడౌన్, మరో పక్క గోశాల మధ్య శిథిలావస్థలో వున్న బడి భవనాన్ని బాగు చేయించారు.పాఠాలను మరాఠాలోకి అనువదించి.
వాటికి టెక్నాలజీ మేళవించి క్యూఆర్ కోడ్ ద్వారా విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.అందరూ టీచర్లలా కాకుండా ఆడియో, వీడియో, కథల రూపంలో పాఠాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
గ్రామంలో బాల్య వివాహాలను రూపుమాపడానికి రంజిత్ కీలక పాత్ర పోషించారు.బాలురతో సమానంగా బాలికలు సైతం పాఠశాలకు హాజరయ్యేలా చూశారు.
విద్యతో పాటు సాంఘిక అసమానతలను రూపుమాపి, ఆర్ధిక వృద్ధికి తోడ్పాటునందించినందుకు గాను రంజిత్‌ను ఈ పురస్కారం వరించింది.మరోవైపు ఈ పోటీలో పాల్గొన్న వారందరిని ప్రధాని బోరిస్ జాన్సన్ అభినందించారు.
కరోనా సంక్షోభకాలంలో టీచర్ల పాత్ర మరువలేనిదని ప్రధాని కొనియాడారు.మరోవైపు కోవిడ్ హీరో అవార్డు పేరిట ఇచ్చిన ప్రత్యేక పురస్కారానికి యూకేకు చెందిన గణిత ఉపాధ్యాయుడు జేమీ ఫ్రాస్ట్‌కు అందజేశారు.
లాక్డౌన్ సమయంలో ఆయన డాక్టర్ ఫ్రాస్ట్ మ్యాథ్స్ ’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ఈ సంక్షోభ కాలంలో పాఠశాలకు దూరంగా వున్న విద్యార్ధులకు పాఠాలను చేరువ చేస్తున్నారు.