నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ముసలం ముదిరింది.నిన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో మిన్నుకున్న అధికార,ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు అధికార మార్పిడి జరగగానే తమ అసంతృప్తికి ఆజ్యం పోస్తున్నారు.
ఇప్పటికే పలు మున్సిపాలిటీలో అవిశ్వాసం కోసం జిల్లా కలెక్టర్లకు సంతకాలతో కూడిన తీర్మాన పత్రాలను సమర్పించారు.ఈ క్రమంలో ఇప్పడు నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ (నందికొండ) మున్సిపాలిటీ కూడా చేరింది.
తాజాగా సోమవారం నందికొండ మున్సిపాలిటీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కలెక్టర్ కి అందజేసిన విషయం తెలిసిందే.
చైర్మన్,వైస్ చైర్మన్ మినహా మొత్తం సభ్యులు అవిశ్వాసం కోసం సంతకాలు చేయడంతో కలెక్టర్ కూడా త్వరలోనే నోటీసు ఇస్తామని చెప్పినట్లు కౌన్సిలర్లు చెప్పడంతో ఇక నందికొండ పురపాలిక హస్తగతం కావడం ఫిక్స్ అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.గత నాలుగేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నందికొండ మున్సిపాలిటీలో ఆనాటి అధికార పార్టీ బీఆర్ఎస్ కు 9 సీట్లు రాగా కాంగ్రెస్ మూడు స్థానాలను గెలుచుకుంది.మెజారిటీ సీట్లతో బీఆర్ఎస్ తరుపున చైర్మన్ గా కర్ణ అనూష రెడ్డి, వైస్ చైర్మన్ గా మంద రఘువీర్ ను ఎన్నుకయ్యారు.
తర్వాత జరిగిన సమీకరణాలు దృష్ట్యా గులాబీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ వర్గాలుగా రెండుగా చీలిపోయారు.ఫండ్స్ కేటాయింపుల్లో పక్షపాతం చూపించడం,బీఆర్ఎస్ అధికార కార్యక్రమాలకు ఎమ్మెల్సీ వర్గం వారికి ఆహ్వానం లేకపోవడంతో కౌన్సిలర్లు అసంతృప్తితో రగిలిపోయారు.
దీనితో గతంలోనే అసమ్మతి వర్గం అవిశ్వాసంపై కలెక్టర్ కు నోటీసులు ఇచ్చారు.కానీ, అధికార పార్టీ కావడంతో ఏదో ఒక రకంగా నోర్లు మూయించారు.
ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారడంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.అప్పటికే కాంగ్రెస్ కు ముగ్గురు కౌన్సిలర్లు ఉండగా రెండవ వార్డ్ కౌన్సిలర్ కరోనా సమయంలో మృతి చెంది ఇద్దరు మిగిలారు.
ముగ్గురు చేరడంతో కాంగ్రెస్ బలం ఐదుకు పెరిగింది.కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటుతో ఆరుకు చేరింది.
దీనితో కాంగ్రెస్ చూపు బీఆర్ఎస్ మిగతా కౌన్సిలర్ల వైపు మళ్ళింది.దీంతో చైర్మన్ వైస్ చైర్మన్ మినహా మిగతా బీఆర్ఎస్ నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరడంతో నందికొండ మున్సిపాలిటీ అనధికారంగా హస్తగతమైంది.
నందికొండ మునిసిపాలిటీలో ముగ్గురు కౌన్సిలర్లతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 9 మంది కౌన్సిలర్లకు చేరుకుంది.చైర్మన్,వైస్ చైర్మన్ లపై అవిశ్వాసం పెట్టేలా తిరుగుబాటు మొదలైంది.9 మంది కౌన్సిలర్లు కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇచ్చారు.అయితే దానికి అనుకూలంగానే కలెక్టర్ 15 రోజులు తర్వాత నోటీసులు జారీ చేస్తానని తెలిపడం జరిగిపోయాయి.
ఇక మిగిలింది లాంఛనమే అంటున్నారు.