దళితుబంధుతో ఆత్మగౌరవం ఇనుమడిస్తుంది.దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా సామాజిక విప్లవం సృష్టిస్తుంది.ఉద్యమ కాలంలోనే పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ.
ఆర్థిక అసమానతలు రూపుమపాలన్న సంకల్పం మేరకే.గాంధీ,నెహ్రు,అంబేద్కర్ కలలను సాకారం చేయడమే లక్ష్యంగా ముందుకు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం -మంత్రి జగదీష్ రెడ్డి.
నల్లగొండ జిల్లా:దళితబంధు పథకం దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేస్తుందని,దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఈ పథకాన్ని కేసీఆర్ రూపొందించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలసి నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో దళితబంధు పథకం కింద ఎంపికైన నకిరేకల్ మండలం నడిగూడెంలో ఐదు గురికి, వల్లభాపురంలో 18 మందికి,నార్కెట్ పల్లి మండలం బాజాకుంటలో 22 మందికి మొత్తం 45 మంది లబ్ధిదారులకు నాలుగు కోట్ల 50 లక్షల రూపాయల విలువ చేసే వాహనాలను ఆయా గ్రామాలకు వెళ్లి అందజేసి,ఆయా గ్రామాలలోని లబ్దిదారులతో మంత్రి ముఖాముఖి మాట్లాడారు.అనంతరం జరిగిన బహిరంగ సభలలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ కాలంలోనే ఉద్యమ నేతగా ఈ బృహత్తర ప్రణాళికకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చుట్టారని,అది నేడు అమలులోకి వచ్చిందన్నారు.
ఆర్థిక అసమానతలను రూపుమాపడంతో పాటు ఈ పథకం దేశంలో సామాజిక విప్లవానికి నాంది పలకనుందన్నారు.జాతిపిత మహాత్మాగాంధీ మొదలు తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు,భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ లు కన్న కలలు ఈ పథకంతో సాకారం అవుతాయన్నారు.
గడిచిన 75 ఏండ్లుగా కొంత ప్రయత్నం జరిగినప్పటికీ ఆశించిన మేర ఫలితాలు రాలేదన్నారు.ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించి రూపొందించిన ఈ పథకం ప్రపంచ వ్యాప్తంగా సామాజిక విప్లవాన్ని సృష్టిస్తుందన్నారు.