నల్లగొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గం( Munugode Assembly constituency )లో గత ఉప ఎన్నికల పుణ్యమాని రాజకీయాలు కలగూర గంపగా మారాయి.కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా రాజగోపాల్ రెడ్డి,కాంగ్రెస్ నుండి పాల్వాయి స్రవంతి, బీఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల అతికష్టంమీద బయటపడ్డారు.కేవలం 15 నెలల్లోనే వచ్చిన జనరల్ ఎలక్షన్స్ లో తిరిగి ఆయనే బీఆర్ఎస్ అభ్యర్ధిగా టిక్కెట్ దక్కించుకోగా, బీజేపీకి గుడ్ బై చెప్పిన కోమటిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉండగా,కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన చలమల్ల కృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు.
మరో కాంగ్రెస్ మహిళా నేత,ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి ( Palvai Sravanthi Reddy )అసమ్మతితో బీఆర్ఎస్ లో చేరారు.ఇక ప్రస్తుత గులాబీ ఎమ్మెల్యే కూసుకుంట్ల వైఖరి నచ్చక స్థానిక ప్రజా ప్రతినిధులు మూకుమ్మడిగా గులాబీ పార్టీకి గుడ్ బై కాంగ్రెస్ లో చేరారు.
బీజేపీ అభ్యర్ధిగా మారిన కాంగ్రెస్ నాయకుడు చల్లమల( Chalamala Krishna Reddy ) పాత బీజేపీ నేతలను పట్టించుకోవడంలేదని బీజేపీ నేతలు పంతంపట్టి కూర్చున్నారు.ఈ కలగూరగంప రాజకీయాలు చూస్తే మునుగోడు రాజకీయం యొక్క రంగులు ఎప్పుడు ఎలా మారుతాయో?ఏ పార్టీ నాయకుడు ఏ క్షణంలో ఏ పార్టీలో చేరుతాడో? ఏ పార్టీ నుండి అభ్యర్ధిగా బరిలో ఉంటాడో? తెలియని అయోమయం నెలకొంది.మారుతున్న నేతల రంగు చూసి పార్టీల కిందిస్థాయి నాయకులు,కార్యకర్తలు కూడా వారినే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.ఎమ్మెల్యేలు,స్థానిక ప్రజాప్రతినిధులే తడుముకోకుండా పార్టీలు మారుతుంటే తామేమీ తక్కువ తిన్నామా అనే ధోరణిలో సామాన్య ప్రజలు కూడా అన్ని పార్టీలకు అనుకూలంగా ఉన్నామనే కలరింగ్ ఇస్తూ అసలు ఏ పార్టీకి ఓటేస్తారో? ఏ నాయకున్ని అభిమానిస్తారో? మర్మం బయటికి రాకుండా అందరితో సఖ్యతగా ఉన్నట్లు నటిస్తూ రాజకీయాల్లో నాయకులనే మించిపోయారు.ఇలాంటి సమయంలో గతంలో ఒక గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్ధి ఇప్పుడు మరో గుర్తుకు మారిపోగా, అప్పడు ఫలానా గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేసిన నాయకులు, ఇప్పుడు ఆ గుర్తుకు ఓటేయ్యవద్దని ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీనితో ఏ గుర్తుఎవరిదో?ఎవరొచ్చి ఏ గుర్తుకు ఓటేయమని చెబుతారో? అర్దంకాక కార్యకర్తలు,ఓటర్లు తికమక పడుతున్నారు.ప్రచారం ముగియడంతో ఓటర్లు ఈవీఎంలపై గుర్తులను చూసి ఓటు వేస్తారా? లేక అభ్యర్థుల ఫొటోలను చూసి వేస్తారా? నమ్మిన పార్టీలను చూసి వేస్తారా?అనేది అర్థంకాక ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల మనసులో అలజడి మొదలైంది.అంతుచిక్కని అయోమయానికి గురిచేస్తున్న ఓటరు నాడి ఎలా ఉందో ? ఏ గుర్తును గుర్తుంచుకుంటారో? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి…!!
.