ఖమ్మం నగర పాలక సంస్థ నందు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు దసర పండగకు పస్తులు ఉంచవద్దని 3వ తేదిన జీతాలు చెల్లించాలని మున్సిపల్ కార్మిక సంఘాల జెఎసి సిఐటియు, ఎఐటియుసి, టిఆర్ఎస్ కేవి, ఐఎఫ్ టీయు ప్రభుత్వాన్ని కోరింది.మంగళవారం ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురబీ, మేయర్ పూనకొల్లు నిరజ లకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణు వర్ధన్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ కేవి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఖమ్మం నగర అధ్యక్షులు ముత్యాల ఫణీందర్, తెలంగాణ రాష్ట్ర ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్ టీయు రాష్ట్ర అధ్యక్షులు జి.రామయ్య మాట్లాడుతూ.నగర పాలక సంస్థ నందు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెలా 1 లేదా 2వ తేదీల్లో జీతాలు పొందుతారు కానీ కాంట్రాక్టు తదితర పద్దతుల్లో పనిచేస్తున్న కార్మికులు ఏంపాపం చేశారు నెలంతా కష్టపడతారు జీతం మాత్రం ప్రతినెలా పనిచేసిన నెలగడిచి మరుసటి నెల 15,18 తేదిల్లో జీతాలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా కార్మికులకు ఆగస్టు నెల జీతాలు ఏవేవో కారణాలు పి.ఎఫ్, ఇయస్ఐ, లలో పుట్టిన తేదీ కరెక్ట్ లేదని పాస్ పోర్ట్ తెచ్చుకోండి,చదుకున్న సర్టిఫికెట్ కావాలని చెప్పి జీతాలు సుమారు 140 మందికి చెల్లించకుండా అపడం జరిగిందని అలా జీతాలు ఆపడం సరైంది కాదని కార్మిక కుటుంబాలు పస్తులు ఉంటున్నారని ఆగస్టు నెల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ముఖ్యంగా రానున్న తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరాకి జీతాల చెల్లింపులు జాప్యం చేయకుండా సెప్టెంబర్ నెల జీతాలు అక్టోబర్ 3వ తేదీ కల్లా చెల్లించాలని అలాగే నాలుగు నెలల పెండింగ్ ఏరియర్స్ కూడా దసరా సందర్భంగా జీతాలతోపాటు కార్మికులకు అందజేయాలని కోరారు.
లేదంటే కార్మిక కుటుంబాలు పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు.కార్మికులకు పెండింగ్ ఏరియర్స్, ఆపిన జీతాలు, సెప్టెంబర్ నెల జీతాలు అక్టోబర్ 3వ తేదీ లోపు చెల్లించకుంటే ఖచ్చితంగా కార్మికులు ఆందోళనకు దిగడం తప్పదని అన్నారు.