అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత సంతతికి చెందిన వ్యక్తులకు ఉన్నత పదవులు కట్టబెడుతూనే వున్నారు.అనధికారిక సమాచారం ప్రకారం ఈ జాబితా 30ని దాటిపోయి వుంటుందని అంచనా.
బైడెన్ నిర్ణయాలు అమెరికాలోని భారత సంతతి సమాజానికి ఆనందం కలిగించినా.ఇప్పటికే మన మీద పడి ఏడుస్తున్న కొందరికి కంటగింపుగా మారే అవకాశం వుంది.
ఈ క్రమంలో మరో ఇండో అమెరికన్ మహిళకు కీలక పదవి దక్కింది.యూఎస్ పాలసీ కౌన్సిల్లో కార్మిక, ఉద్యోగ విభాగాలకు సంబంధించి అధ్యక్షుని ప్రత్యేక సహాయకురాలిగా ప్రొనీతా గుప్తా నియమితులయ్యారు.
ఈ మేరకు శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది.ప్రస్తుతం ప్రోనీతా సెంటర్ ఫర్ లా అండ్ సోషల్ పాలసీ (సీఎల్ఏఎస్‌పీ)లో జాబ్ క్వాలిటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
అత్యల్ప స్థాయి వేతనాలకు పనిచేసే కుటుంబాలకు పని, ఆర్థిక భద్రతను కల్పించడంలో ప్రొనీతా కృషి చేశారు.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో 2014 నుంచి 2017 జనవరి వరకు యూఎస్ కార్మిక విభాగం ఉమెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌గా ఆమె పని చేశారు.
పని ప్రదేశాల్లో వర్ణవివక్షతను రూపుమాపడంలోనూ ప్రొనీతా విశేష కృషి చేశారు.లాస్ ఏంజిల్స్‌లోని స్కోప్ ఏజెండాకు ప్రొనీతా రిసెర్చ్ డైరెక్టర్‌గాను పనిచేశారు.కొలంబియా యూనివర్శిటీ నుంచి ఎంపీఏ, క్లార్క్ యూనివర్శిటీ నుంచి బీఏ పట్టాలు పొందారు.

కొద్దిరోజుల క్రితం రోహిత్ చోప్రా అనే భారతీయుడిని బైడెన్.బ్యూరో ఆఫ్ కన్జ్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ (సీఎఫ్‌పీబీ) డైరెక్టర్‌గా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.కొలంబియాలో స్థిరపడిన చోప్రా ఐదేళ్ల కాలానికి గాను విధులు నిర్వర్తిస్తారని వైట్‌హౌస్ ప్రకటించింది.
రోహిత్ చోప్రా గతంలో సీఎఫ్‌పీబీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు.అలాగే యూఎస్ ఎడ్యుకేషన్ విభాగానికి ప్రత్యేక సలహాదారుగాను వ్యవహరించారు.2018 నుంచి ఫెడరల్ ట్రేడ్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.