తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే ఏపీ అధికార పార్టీ వైసిపి కి సినీ గ్లామర్ తక్కువగానే ఉంది.గతంలో టిడిపి ప్రతిపక్షంలో ఉన్నా.
అధికారంలో ఉన్నా సినీ రంగానికి చెందినవారు ఎక్కువగా ఆ పార్టీకి అనుబంధంగా ఉండేవారు.టిడిపి తరఫున ఏ అంశంపై నైనా మాట్లాడేందుకు , అలాగే ఆ పార్టీ ప్రచార కార్యక్రమాలలో వారు స్వచ్ఛందంగా పాల్గొంటూ స్వామి భక్తిని ప్రదర్శిస్తూ వచ్చేవారు.
టిడిపి తో పోలిస్తే వైసిపికి ఆ సినీ గ్లామర్ చాలా తక్కువ.మొదటి నుంచి వైసీపీకి వీర అభిమానులుగా ఉంటూ, ఆ పార్టీ పైన, జగన్ పైన ఎవరు విమర్శలు చేసినా వారిపై విరుచుకుపడుతూ ఉండే పోసాని కృష్ణ మురళి తో పాటు, సినీ హీరో, నిర్మాత మోహన్ బాబు, అలాగే సినీ నటుడు ఆలీ , 40 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఇలా కొంతమంది వైసీపీ తరఫున యాక్టివ్ గా ఉన్నారు.

ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.కానీ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడున్నర ఏళ్ళు గడిచాక ఆలీకి, పోసాని కృష్ణ మురళికి జగన్ పదవులు కట్టబెట్టారు అంతకు ముందే పృథ్వీరాజ్ కు ఎస్ వి బి సి చైర్మన్ గా అవకాశం కల్పించినా, ఆయనకు ఉద్దేశపూర్వకంగానే పొగ పెట్టారనే ప్రచారం జరిగింది.ఇక ఆలీ సైతం తనకు రాజ్యసభ సభ్యత్వం కానీ, వక్ బోర్డ్ చైర్మన్ పదవి కానీ కట్టబెడతారని అనేకసార్లు వైసిపి పెద్దలపై ఒత్తిడి చేశారు .అయినా జగన్ ఏమాత్రం వారిని పట్టించుకోకుండా వచ్చారు.అయితే సినీ రంగానికి చెందినవారు వైసిపికి మరింత దూరం అవుతున్నారని, రాబోయే రోజుల్లో ఎవరూ వైసీపీ వైపు చూసే అవకాశం లేదని సంకేతాలు రావడంతోనే జగన్ ఆలీకి, పోసాని కృష్ణ మురళి కి పదవులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

ఇక సినీ నటుడు జగన్ బంధువైన మోహన్ బాబు కు ఇంకా ఏ పదవి కట్ట బెట్టలేదు.ఆయన అసలు పార్టీలో ఉన్నారో లేరో కూడా తెలియని పరిస్థితి ఉంది.అయితే ఇప్పుడు సినీ రంగానికి చెందిన వారికి జగన్ పెద్దపేట వేయడానికి కారణం, సినీ రంగానికి చెందిన మరి కొంత మందిని వైసీపీ వైపు తీసుకోవచ్చి సినీ గ్లామర్ పార్టీకి పెరిగేలా చేయాలని, ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేకపోవడంతో సినీ రంగానికి చెందినవారిని ఎన్నికల ప్రచారానికి దించితే బాగుంటుందని అందుకే ఇప్పుడు కొంతమందికి పదవులు ఇవ్వడం ద్వారా, మిగిలిన వారు తమకు ఏదో ఒక పదవి దక్కుతుందనే ఆశతో వైసిపికి దగ్గర అవుతారనే లెక్కలు జగన్ వేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది .