హెచ్ 4 వీసాదారుల పని అనుమతులు రద్దు చేసేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన నూతన వలస విధానాన్ని ఇటీవల జో బైడెన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో హెచ్ 4 వీసాదారులకు వర్క్ పర్మిట్‌కు సంబంధించిన ప్రస్తుత స్థితిపై అమెరికా కోర్టు ఆరా తీసింది.మార్చి 5లోగా ఉమ్మడి నివేదికను కోర్టుకు సమర్పించాల్సిందిగా డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ కోర్ట్ జస్టిస్ తాన్యా ఎస్ చుట్కాన్ కోరారు.
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల (భార్యా లేదా భర్త)తో పాటు 21 ఏళ్ల లోపు పిల్లలకు.అమెరికా పౌరసత్వం మరియు వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) హెచ్4 వీసాలు జారీ చేస్తుంది.వీరిలో ఎక్కువ మంది భారతీయ ఐటీ నిపుణులే.హెచ్ 1 వీసా అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా.ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగిన విదేశీ సాంకేతిక నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఈ వీసా వీలు కల్పిస్తుంది.
భారత్, చైనా సహా తదితర దేశాల నుంచి ప్రతి ఏటా వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి సాంకేతిక సంస్థలు హెచ్ 1 బీ వీసాపై ఎక్కువగా ఆధారపడతాయి.అలాగే అమెరికాలో ఉపాధి ఆధారిత చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదాను కోరుకునే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిన వారికి హెచ్ 4 వీసా జారీ చేస్తారు.

కాగా, హెచ్-4 వీసాదారులు చట్టపరంగా అమెరికాలో ఉద్యోగం చేసుకునేలా పని అనుమతి కల్పిస్తూ 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయం తీసుకున్నారు.అమెరికాలో నివాసం ఉంటున్న ఇతర దేశీయులకు ఈ నిర్ణయం ఎంతగానో మేలు చేసింది.అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల్లో భారతీయులే అధికంగా ఉన్నారు.ఈ నిర్ణయంతో వారంతా లబ్ధి పొందారు.హెచ్4 వీసాలతో అమెరికాలో పని చేస్తున్న ఎంతో మంది విదేశీ మహిళలు వైద్య రంగంతో పాటు అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.అలాగే హెచ్-1బీ వీసాదారుల భాగస్వాముల్లో ఎక్కువమంది నిపుణులైన భారతీయ మహిళలే ఉన్నారు.
హెచ్ వీసాలలో మహిళలే పెద్ద సంఖ్యలో చోటు దక్కించుకోవడం వల్ల ఇమ్మిగ్రేషన్ విధానంలో లింగ అసమానతలను తగ్గించడానికి దోహద పడిందని అప్పట్లో హోమ్ లాండ్ సెక్యూరిటీ అభిప్రాయపడింది.

డిసెంబర్ 2017 నాటికి, హెచ్ -4 వీసాదారుల వర్క్ పర్మిట్లమకు సంబంధించి 1,26,853 దరఖాస్తులను యూఎస్‌సీఐఎస్ ఆమోదించింది.కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సిఆర్ఎస్) 2018 నివేదిక ప్రకారం, హెచ్ -4 వర్క్ పర్మిట్ల కోసం ఆమోదించిన దరఖాస్తులలో 93 శాతం భారతదేశంలో జన్మించిన వ్యక్తులకు జారీ చేయబడగా, మిగిలిన 5 శాతం చైనీయులకు జారీ చేశారు.అయితే.
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే వలస విధానంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు.హెచ్ 4 వీసాదారులకు పని అనుమతులు రద్దు చేయనున్నట్లు అమెరికా సుప్రీంకోర్టుకు తెలిపారు.
అయితే ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని జో బైడెన్ ఇటీవల రద్దు చేశారు.ఈ విషయంలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలోనే న్యాయస్థానం ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నివేదికను కోరింది.
తద్వారా ప్రభుత్వ యంత్రాంగం, ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీలు చేపట్టిన చర్యలు తెలిసే వీలుంది.