అవినీతికి అడ్డాగా సూర్యాపేట:సంకినేని

సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సూర్యాపేట గడ్డను మంత్రి సిండికేట్ అడ్డగా మార్చడంతో నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు.శనివారం జిల్లా కేంద్రంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి సూర్యాపేట నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో అవినీతిలో మొదటి స్థానంలో నిలబెట్టారని ఆరోపించారు.2014 తర్వాత ప్రభుత్వ హాస్టల్స్ గంజాయికి అడ్డాలుగా మారాయని అన్నారు.పోలీసుల కనుసన్నల్లో గంజాయి రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుందని ఆరోపించారు.

 Suryapeta As A Haven For Corruption: Sankineni-TeluguStop.com

గతవారం కట్టంగూర్ లో దొరికిన గంజాయి కేసులు ఇక్కడి నుంచే రవాణా చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్టు ఆయన గుర్తు చేశారు.ఎక్కడ గంజాయి పట్టుకున్నా సూర్యాపేటతో సంబంధాలు బయటపడుతున్నాయన్నారు.

గతంలో ఇక్కడ దీర్ఘకాలంగా పని చేసిన ఓ సీఐ మంత్రికి సన్నిహితుడిగా పేరు పొంది,హుజూర్ నగర్ కు బదిలీపై వెళ్లి అక్కడ కూడా గుట్కాకు అడ్డగా మార్చాడని,తరువాత అతనిపై అధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి అనుచరులు ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని,రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగే హత్యలకు పథక రచన చేసేందుకు మంత్రి అనుచరులు ముందు ఉంటున్నారని ధ్వజమెత్తారు.

మంత్రి అనుచరులు సామాన్య ప్రజల భూములపై కన్ను పడితే చాలు ఆ భూములు టీఆర్ఎస్ నాయకులుకే అమ్మాలి తప్ప,వేరే వారికి ఎవరికీ అమ్ముకోని పరిస్థితి నెలకొందని అన్నారు.సామాన్య భూ యజమానులపై ఆ విధంగా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులకు సరైన మద్దతు ధర లభించలేదని దీనిపై అధికారులు కొనుగోలుదారులు కుమ్మక్కయ్యారని మండిపడ్డారు.రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసం ఏనాడు బాగుపడిన దాఖలాలు లేవని చెప్పారు.

సూర్యాపేట మున్సిపాలిటీలో అన్ని పనులు ఒకే వ్యక్తికి ఇవ్వడం ద్వారా నాసిరకం పనులు చేస్తూ కోట్లాది రూపాయలు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని అన్నారు.అర్హత లేని వ్యక్తికి కాంట్రాక్టు పనులు కేటాయిస్తూ అవినీతికి కొమ్ముకాస్తున్నారని అన్నారు.

సూర్యాపేటలో మంత్రి బినామికి పనులు కేటాయించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.మెడికల్ కళాశాలలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు మంత్రి బంధువులకు అప్పగించి విషయం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.

పోరాటాల పురిటిగడ్డ సూర్యాపేటను అవినీతి మకిలీ గడ్డగా మార్చిన ఘనత మంత్రికే దక్కుతుందన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ బెల్లం సిండికేట్ రాజ్యమేలుతుందని,ఈ సిండికేట్ లో మంత్రితో పాటు కిరాణం ఫ్యాన్సీ అధ్యక్షులు టిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులకు సంబంధం ఉందని ఆరోపించారు.

జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మూసి ఇసుక అక్రమ రవాణా ద్వారా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కోట్లాది రూపాయలు కూడా పెట్టారని ఆరోపించారు.మంత్రి జగదీష్ రెడ్డికి నిబద్ధత ఉంటే అన్ని అవినీతి ఆరోపణలపై సిబిఐ ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు,భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అధికార పక్షానికి కొరకరాని కొయ్యగా మారారని చెప్పొచ్చు.సూర్యాపేట నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతుందని మొదటి నుంచి ప్రెస్ మీట్స్ ద్వారా చెబుతున్న సంగతి తెలిసిందే.

నూతన కలెక్టరేట్ నిర్మాణంలో నాలుగు వందల కోట్ల అవినీతి జరిగిందని సంచలనానికి తెరలేపిన విషయం కూడా విదితమే.ఆ తర్వాత వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని మొట్టమొదటగా ప్రెస్ మీట్ నిర్వహించింది సంకినేని కావడం గమనార్హం.

ఆ తర్వాత ప్రభుత్వం స్పందించి ఐకేపీ కేంద్రాలలో అవినీతిపై విచారణ జరిపి కొన్ని సంబంధిత మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదుచేసి, ప్రజల ధనాన్ని కొంతమేర అధికారులు కాపాడగలిగారు.ఇప్పుడు తాజాగా బెల్లం సిండికేట్లపై ఆయన ఘాటైన ఆరోపణలు చేశారు.2014 కు ముందు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎకరానికి లక్ష రూపాయల చొప్పున అవినీతికి పాల్పడ్డారని,వైన్స్ లో సిండికేట్, తాగే మంచినీటిని కూడా సిండికేట్ గా మార్చి తర్వాత ప్రజల ఆగ్రహానికి గురయ్యారని,ఇప్పుడు ప్రస్తుత మంత్రికి అదే గతి పడుతుందని జోస్యం చెబుతున్నారు.ఏదిఏమైనా సంకినేని ఆరోపిస్తున్న విషయాలు జిల్లాలో సంచలనాలుగా మారుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube