మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నరసింహస్వామి ఆలయాలు మనకు దర్శనం కల్పిస్తాయి.ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో స్వామివారికి ఎన్నో పుణ్య క్షేత్రాలు కొలువై ఉన్నాయి.
ఈ విధంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచినదే కదిరి నరసింహ స్వామి ఆలయం.ఈ కదిరి ఆలయంలో కొలువై ఉన్న స్వామివారి పేరే కాటమరాయుడు.
అసలు ఈ ఆలయంలో ఉన్న స్వామివారికి ఏ విధంగా పిలవడానికి గల కారణం ఏమిటి? ఈ ఆలయం ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
అనంతపురం జిల్లా, కదిరిలో వెలసిన నరసింహ స్వామికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.పురాణాల ప్రకారం హిరణ్యకశిపుని నరసింహస్వామి చంపిన సంగతి మనకు తెలిసిందే.
అయితే స్తంభం నుంచి చీల్చుకుని వచ్చిన నరసింహస్వామి హిరణ్యకశిపుని ఈ ప్రాంతంలోనే చంపినట్లు పురాణాలు చెబుతున్నాయి.ఈ ప్రాంతంలో ఉన్న ఖదిర అనే చెట్టు కలపతో తయారుచేసిన స్తంభం నుంచి స్వామివారు బయటకు వచ్చినట్లు చెప్పడంతో ఈ ప్రాంతానికి కదిరి అనే పేరు వచ్చింది.
ఈ విధంగా హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఎంతో ఉగ్రరూపం దాల్చిన నరసింహుడు ఆ ప్రాంతంలో ఉన్న కొండపై విశ్రమించాడు.అదేసమయంలో దేవతలందరూ తమ స్తోత్రాల ద్వారా స్వామి వారి కోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేశారు.
ఆ విధంగా దేవతల స్తోత్రాలకు మంత్ర ముద్దుడైన నరసింహస్వామి అక్కడే విగ్రహ రూపంలో కొలువై ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి.ఆ విధంగా కొండపై వెలసిన నరసింహ స్వామి అనాది కాలం నుంచి పూజలందుకుంటున్నారు.

ఇక్కడ వెలసిన స్వామివారిని కాటమరాయుడని, బేట్రాయి స్వామి అని, పిలుస్తారు.స్వామివారి వెలసిన ఈ ప్రాంతంలోనే కాటం అనే గ్రామం ఉండటం వల్ల స్వామివారికి కాటమరాయుడని పేరు వచ్చింది.అదే విధంగా ప్రతి సంవత్సరం వసంత ఋతువులో స్వామివారికి పెద్దఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.ఈ విధంగా వసంతఋతువులో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం వల్ల స్వామివారికి వసంత వల్లభుడు అనే పేరుతో కూడా పిలుస్తారు.
అదేవిధంగా కదిరి ఆలయం దాదాపు 700 సంవత్సరాల కాలం నాటిదని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.విజయనగర రాజులు ఈ ఆలయ పై ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపించే నిర్మించారని తెలుస్తోంది.
అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణంలో ముస్లింల పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పవచ్చు.అందువల్ల ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు ముస్లింలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.
దేశంలో ఏ ఆలయంలో లేని విధంగా ఈ ఆలయంలో స్వామివారి మూలవిరాట్ తో పాటు ప్రహ్లాదుడి విగ్రహం ఉండటం విశేషం.స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఉపయోగించే రథం ఏ ఆలయాలలో కూడా ఉండని విధంగా ఎంతో పెద్దగా ఉంటుంది.
ప్రతి ఏడాది ఫాల్గుణ మాస పౌర్ణమి రోజు స్వామివారిని ఎంతో ఘనంగా ఊరేగిస్తారు.కనుక ఈ పున్నమిని కదిరి పున్నమి అని కూడా పిలుస్తారు.
ఈ పున్నమి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన దవనము సమర్పించడం ద్వారా స్వామివారు ప్రీతి చెందుతారని భావిస్తారు.