తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పధకం ఎంతలా ప్రాచుర్యం పొందిందనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.దళిత బంధు పధకంపై నేడు కలెక్టర్ లతో సమావేశం కానున్న కేసీఆర్ పధకం అమలు విధానంపై కలెక్టర్ లకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
అయితే దళిత బంధు పధకం హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టిన కేసీఆర్ ఇక రానున్న రోజుల్లో నియోజకవర్గానికి వంద మందికి దళిత బంధు పధకం అమలు చేయనున్నట్లు తాజాగా కేసీఆర్ తెలిపిన విషయం తెలిసిందే.హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత దళిత బంధు పధకాన్ని అమలు చేయరని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఎటువంటి వివాదాస్పద నిర్ణయాలకు తావు లేకుండా చాలా జాగ్రత్త పడుతున్న పరిస్థితి ఉంది.
అందుకే దళితబంధు పధకాన్ని ఎన్నికల సమయం వరకు కొనసాగిస్తూ ఎన్నికల ప్రచారంలో మిగతా వారికి కూడా ఇస్తామనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలనే వ్యూహ రచన చేస్తున్న పరిస్థితి ఉంది.
అంతేకాక ఈ పధకం లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను ఎమ్మెల్యేలకు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజకీయంగా కూడా లబ్ధి జరిగేలా బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు.దీంతో పాటు ఇంకా కొద్ది నెలల్లో ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయనున్న తరుణంలో ఇక టీఆర్ఎస్ పై ప్రజల్లో, నిరుద్యోగుల్లో అనుకూల వాతావారణం పెంపొందించుకునేలా చాలా స్పష్టమైన క్లారిటీతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.
మరి హుజూరాబాద్ లో దళిత బంధు పథకం అంతగా టీఆర్ఎస్ కు ప్రయోజనం కలిగించకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోజనం ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.