ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తనకు కావాల్సిన వాళ్లను అందలం ఎక్కించడం, గతంలో తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లను వేధించడం చూస్తూనే ఉన్నాం.తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది.
గతంలో తన జగతి పబ్లికేషన్స్‌పై విచారణ జరిపి, అందులో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టిన ఓ అధికారిని జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవోగా ఉన్న ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.ఈడీబీ సీఈవోగా ఆయన అక్రమాలకు పాల్పడ్డారని, పరిశ్రమల శాఖ ఇచ్చిన నివేదిక మేరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు.అంతేకాదు ఆయనపై ఏసీబీ, సీఐడీ విచారణకు కూడా ఆదేశించారు.
అయితే ఈ సస్పెన్షన్‌కు మరో కోణాన్ని కొందరు వినిపిస్తున్నారు.పదేళ్ల కిందట ఐటీ శాఖ అదనపు కమిషనర్‌గా కృష్ణ కిశోర్ ఉన్న సమయంలో జగన్ అక్రమాస్తుల కేసును విచారించారు.జగతి పబ్లికేషన్స్ రూ.10 షేరును రూ.370కి అమ్మడంపై ఆయన విచారణ జరిపారు.అసలు జగతి పబ్లికేషన్స్‌కు అంత సీన్ లేదని, ఆ మాటకొస్తే దాని షేరు విలువ మైనస్ 18గా ఉంటుందని విచారణలో కృష్ణ కిషోర్ తేల్చారు.

షేర్ల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం ఇతర మార్గాల ద్వారా వచ్చినట్లు పరిగణించి.దీనికి రూ.325 కోట్ల పన్ను చెల్లించాలనీ ఆయన తేల్చారు.ఆయన ఇచ్చిన నివేదికను సీబీఐ కూడా వాడుకుంది.
దీంతో అప్పుడు జగతిపై ఆయన ఇచ్చిన నివేదికను మనసులో పెట్టుకునే ఇప్పుడు జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని సీనియర్ అధికారులు భావిస్తున్నారు.
అంతేకాదు అసలు ఈడీబీ సీఈవోగా అక్రమాలకు పాల్పడే ఆస్కారమే లేదని, ఆ విభాగం ఎవరికీ నేరుగా భూములు కేటాయించడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం కుదరదని ఓ రిటైర్డ్ అధికారి చెబుతున్నారు.
పైగా కృష్ణకిషోర్ కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారి.అలాంటి అధికారిపై నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్‌లాంటి నిర్ణయం తీసుకోవడంపై కూడా పలువురు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.