తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా పోరాటం చేస్తూ వస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.ఎప్పటికైనా తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీ ఇస్తుంది అనేది రేవంత్ నమ్మకం.
అదీ కాకుండా, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పోల్చుకుంటే, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది తామేనని రేవంత్ నమ్మకం.అందుకే ఎన్ని రకాలుగా టిఆర్ఎస్ నుంచి వేధింపులు ఎదురవుతున్నా, లెక్కచేయకుండా రేవంత్ దూసుకెళ్తున్నారు.
కొద్దిరోజులుగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి అక్రమాలను బయటకు తీస్తూ, శ్రీశైలం ప్రాజెక్టులో జరిగిన అగ్ని ప్రమాదం దగ్గర నుంచి వివిధ అంశాల్లో నెలకొన్న అవినీతి వ్యవహారాలపై గొంతు పెంచి మరీ విమర్శలు చేస్తున్నారు రేవంత్.
ఈ వ్యాఖ్యలు జనాల్లోకి వెళ్లడం లేదు అనే అభిప్రాయం రేవంత్ గ్రహించారో ఏమో తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం సరికొత్త సెంటిమెంట్ తో టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పోరాటం చేసిన ఉద్యమకారులను టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వివిధ కేసులతో వేధింపులకు పాల్పడుతున్నారని కేసీఆర్ పై విమర్శలు చేస్తూ, ఈ విషయంపై ప్రజల్లో చర్చ జరిగే విధంగా రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.తెలంగాణ ఉద్యమం సమయంలో కెసిఆర్ ఎన్నో వాగ్దానాలు చేశారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత కాపలా కుక్కగా ఉంటానని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారని రేవంత్ సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణకు కెసిఆర్ నుంచి విముక్తి కల్పించాలని, దీనికోసం తాను ఎంతవరకైనా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ రేవంత్ చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా టీజేఎస్ అధినేత కోదండరామ్ పార్టీలకతీతంగా ఒక వేదిక ఏర్పాటు చేయాలని రేవంత్ కోరారు.
రేవంత్ ఈ విధంగా సరికొత్త రీతిలో తెలంగాణ సెంటిమెంట్ తోనే కేసీఆర్ ను ఇరుకున పెట్టడం ద్వారా ప్రజల్లో కేసీఆర్ తీరుపై అసహనం కలిగేలా చేసి తమకు అనుకూలంగా మార్చుకోవాలని విధంగా రేవంత్ ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.