సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలై చివరికి పార్లమెంట్ లో ప్రధాన ప్రతి పక్షం గా కూడా స్థానాన్ని సంపాదించుకోలేని కాంగ్రెస్ పార్టీ కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.ఓటమికి భాద్యత వహిస్తూ ఒకపక్క కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేస్తాను అంటూ పట్టుబట్టడం అలానే ఆయన అడుగుజాడల్లోనే ఇతర రాష్ట్ర నేతలు కూడా రాజీనామా ల బాట పట్టడం ఇలా వరుసగా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఎన్నికల తరువాత మొన్నటికి మొన్న తెలంగాణా లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ని టీఆర్ ఎస్ లో విలీనం చేసిన విషయం తెలిసిందే.ఇంకా ఆ ఘటన మరువక ముందే గత మూడు నాలుగు రోజులుగా కర్ణాటక లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కూడా ఆ పార్టీ అధిష్టానానికి నిద్ర లేకుండా చేస్తుంది.
మధ్యవర్తి గా డీకే శివకుమార్ ని పంపినప్పటికీ రెబల్ ఎమ్మెల్యేలు కనీసం ఆయనను కలవలేదు సరికదా హోటల్ దరిదాపులకు కూడా రానీకుండా పోలీసుల చేత చర్యలు తీసుకున్నారు.ఇలా వరుస ఎదురు దెబ్బలతో అల్లాడుతున్న కాంగ్రెస్ కు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది.

గోవా కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక గ్రూప్‌గా ఏర్పడి అధికార బీజేపీలో శాసనసభాపక్షం విలీనం చేయాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ సమర్పించినట్లు తెలుస్తుంది.ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవలేఖర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం బుధవారం సాయంత్రం స్పీకర్‌ను కలిసింది.ఈ విషయాన్ని స్పీకర్ సైతం ధ్రువీకరించారు.
బీజేపీ బలం పెరిగినట్లు అటు సీఎం కూడా లేఖ ఇచ్చినట్లు స్పీకర్ తెలిపారు.దీంతో కాంగ్రెస్ పార్టీకి మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే.
మరోవైపు వీరి చేరికతో బీజేపీ ప్రభుత్వ బలం 27కి చేరినట్లు తెలుస్తుంది.