రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దె చెరువు పక్కన గల పల్లె ప్రకృతి వనంలోని చెట్లను అనుమతి లేకుండా నరికి వేసిన ఘటనపై ఎంపీడీవో సమక్షంలో మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు.చెట్లు నరికిన వ్యక్తికి వేయి రూపాయల జరిమానా తో పాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫీల్డ్ అసిస్టెంట్ కు మేమో జారీ చేశారు.
పల్లె ప్రకృతి వనంలో చెట్లను చెట్లను నరికి వేత అనే అంశం పత్రికలో ప్రచురితమైన వార్తకు మండల పంచాయతీ అధికారులు స్పందించారు.ఎలాంటి అనుమతి లేకుండా చెట్లు నరికి వేసిన మండల కేంద్రానికి చెందిన చంటి హనుమయ్య ను పిలిపించి విచారణ చేపట్టారు.
పల్లె ప్రకృతి వనంలో కొమ్మలతో పాటు కొన్ని చెట్లను కూడా కొట్టి వేసినట్లు అధికారుల విచారణలో తేలింది.దీంతో అనుమతి లేకుండా చెట్లు కొట్టిన చంటి హనుమయ్యకు గ్రామపంచాయతీ అధికారులు( Gram Panchayat Officers ) వెయ్యి రూపాయలు జరిమానా విధించారు.
అనుమతి లేకుండా చెట్లు నరికి వేతకు పాల్పడే వారికి జరిమానాలు విధించడంతోపాటు వాల్టా చట్టం ప్రకారం చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎంపీడీవో సత్తయ్య హెచ్చరించారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్ కు మేమో జారీ చేశారు.
చెట్ల నరికివేతకు పాల్పడిన వారిపై నామమాత్రంగా అధికారులు విచారణ చేపట్టి వేయి రూపాయల జరిమానా తో చేతులు దులుపుకున్నారు.అధికారులు ఇలాగే పట్టి పట్టనట్లు విచారణ చేపడితే మరోసారి ఇదే చెట్ల నరికివేత పునర్వృతం అవుతుందని మండల ప్రజలు వాపోతున్నారు.
అధికారులే చెట్లు నరికి వేతకు నామమాత్రంగా విచారణ చేపట్టి సహకరిస్తే జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేసేందుకు వెనకాడబోమని మండల ప్రజలు అన్నారు, ఈ విచారణలో మండల పంచాయతీ అధికారి జోగం రాజు, గ్రామపంచాయతీ అధికారి టి.ప్రవీణ్ కుమార్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.