రాజన్న సిరిసిల్ల జిల్లా : పార్లమెంట్ ఎన్నికలలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పన పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయని, మే 13న పోలింగ్ జరగనుందని, విధి నిర్వహణ కారణంగా పోలింగ్ రోజు ఓటు వేసే అవకాశం లేని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్స్ సదుపాయం కల్పించాలని కలెక్టర్ తెలిపారు.
పోలింగ్ రోజు ఓటు వేయలేని వారి కోసం ఫారం 12 డీ లను అందుబాటులో ఉంచామని, పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ కోసం ప్రత్యేక నోడల్ అధికారిని నియమిస్తామని, పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని అర్హులైన వారందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు.
రవాణా సేవలు ,మీడియా, విద్యుత్, బిఎస్ఎన్ఎల్ పోస్టల్ టెలిగ్రామ్ దూరదర్శన్, ఆకాశవాణి ,రాష్ట్ర మిల్క్ యూనియన్ , మిల్క్ కోఆపరేటివ్ సొసైటీలు ఆరోగ్యశాఖ, ఫుడ్ కార్పొరేషన్ , ఆర్టీసీ అగ్నిమాపక సేవలు ట్రాఫిక్ పోలీస్, మొదలగు 33 అత్యవసర శాఖల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్స్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు.
ఎన్నికల నిర్వహణ నిర్వర్తించేందుకు జిల్లాలో వినియోగించే ప్రతి సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 85 ఏళ్ళ వయస్సు గల వారు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకుంటే వారి ఇంటి వద్దకు 2 పోలింగ్ అధికారులు వీడియో గ్రాఫర్ సెక్యూరిటీ వచ్చి ఓటు వేసే అవకాశం కల్పిస్తారని ఏ తేదీ ఏ సమయంలో వచ్చేది ముందుగానే సమాచారం ఇస్తారని అన్నారు.పోస్టల్ బ్యాలెట్లు పొందడానికి ఫారం 12 డీ లను సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని, వ్యక్తిగత వివరాలు ఓటరు గుర్తింపు సమాచారం పోస్టల్ బ్యాలెట్ ఎందుకు కోరుతున్నారో చెప్పాలని, రిటర్నింగ్ అధికారి వాటిని పరిశీలించి అర్హత ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ మంజూరు చేస్తారని అన్నారు.
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద వెళ్ళి తమ ఓటు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు పి.గౌతమి, ఖీమ్యా నాయక్, సిరిసిల్ల వేములవాడ అర్.డి.ఓ లు రమేష్, రాజేశ్వర్ , డి.ఈ.ఓ, రమేష్ కుమార్ డి.డబ్ల్యు ఓ లక్ష్మి రాజం, ఏ ఓ రామ్ రెడ్డి, ఎలక్షన్ పర్యవేక్షకులు , ఈ డి.ఎం.శ్రీకాంత్ లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.