రాజన్న సిరిసిల్ల: లోక్ సభ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని, మే 13న పోలింగ్ సజావుగా జరిగేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎన్నికల పోలింగ్ కు తీసుకోవాల్సిన చర్యలపై సెక్టోరియల్ అధికారులు, ఎంపిడిఓలతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి మాట్లాడుతూ మే 13న లోక్ సభ పోలింగ్ కు సరిగ్గా వారం రోజుల గడువు మాత్రమే ఉందని , ఓటర్ జాబితా ప్రకారం ప్రతి ఓటర్ కు బూత్ స్థాయి అధికారుల ద్వారా ఓటర్ సమాచార స్లిప్పు పంపిణీ చేయాలని, గ్రామాలలో ఇటీవల కాలంలో మరణించిన వారి వివరాలు పంచాయతీ కార్యదర్శి ద్వారా సేకరించి ఓటరు జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ తెలిపారు.
ప్రతి మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను ఎంపిడిఓ పరిశీలించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తప్పనిసరిగా త్రాగు నీరు , టాయిలెట్ల, నీడ కల్పించేలా టెంట్ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు.మన జిల్లాలో అధికంగా ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నందున, అమ్మ అభివృద్ధి కమిటీల ద్వారా చేపట్టిన త్రాగునీరు, టాయిలెట్ల అభివృద్ధి పనులు పోలింగ్ కంటే ముందే ముగిసేలా కార్యాచరణ వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
పోలింగ్ నేపథ్యంలో ఎంపిడిఓ లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరుగుతుందని, వీటిని వినియోగించుకొని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తప్పనిసరిగా కూలర్ ఏర్పాటు చేయాలని అన్నారు.
అసెంబ్లీ సెగ్మెంట్ లలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల, రిసెప్షన్ కేంద్రాల వద్ద సంబంధిత పోలింగ్ బృందాలకు సరైన పోలింగ్ సామాగ్రి చేరే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, పోలింగ్ కేంద్రాల పోలింగ్ సామాగ్రి తరలించేందుకు అవసరమైన వాహనాలు సన్నద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది, బూత్ స్థాయి అధికారి వద్ద అవసరమైన మేర ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో పెట్టాలని కలెక్టర్ తెలిపారు.
పోలింగ్ సకాలంలో ప్రారంభించాలని, ముందుగానే మాక్ పోల్ పూర్తి చేయాలని, ప్రతి 2 గంటలకు పోలింగ్ వివరాలు రిపోర్ట్ చేయాలని అన్నారు.
మొదటి 2 గంటల పోలింగ్ అత్యంత కీలకమని, అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఈవిఎం యంత్రాల మాక్ పోల్ చేసిన తర్వాత తప్పనిసరిగా సి.ఆర్.సి చేయాలని, ఈవిఎం మరమ్మత్తు గురైతే వెంటనే సెక్టార్ అధికారులు దృష్టికి తీసుకొని రావాలని, రిజర్వ్ ఈవీఎంల నుంచి మరో ఈవిఎం యంత్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.పోలింగ్ ముగిసిన తర్వాత 17సి రిజిస్టర్, ఫారం పై పోలింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల సహయ రిటర్నింగ్ అధికారి పూజారి గౌతమి, ఆర్డీవో రమేష్, సెక్టార్ అధికారులు, సీపీఓ శ్రీనివాసాచారి, ఎం.పి.డి.ఓ లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, ఏఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.