రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం గుర్తించిన పోలింగ్ కేంద్రాల పై ఉన్న అభ్యంతరాలను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు డిసెంబర్ 12 లోపు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.
మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీక్ష నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 260 గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాల వివరాలు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 260 గ్రామాలలోని 2268 వార్డులలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 2268 పోలింగ్ కేంద్రాలను గుర్తించి డ్రాఫ్ట్ జాబితా విడుదల చేశామని, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ జాబితాను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 12 లోపు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 200 ఓటర్ల వరకు 1734 పోలింగ్ కేంద్రాలు , 400 ఓటర్ల వరకు 468 పోలింగ్ కేంద్రాలు ,650 ఓటర్ల వరకు 76 పోలింగ్ కేంద్రాలు, మొత్తం 2268 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఈ వివరాలను పార్టీల కార్యకర్తలకు అందజేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు సందేహాలు ఉంటే డిసెంబర్ 12 లోపు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు.
డిసెంబర్ 13న అభ్యంతరాల పై సంబంధిత మండలాల ఎంపీడీఓ అధికారులు స్క్రూట్ ని పూర్తి చేసి నివేదిక అందించాలని, డిసెంబర్ 16 లోపు జిల్లా కలెక్టర్ ఆమోదంతో తుది నిర్ణయం తీసుకొని డిసెంబర్ 17న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎంపీడీఓల ద్వారా తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించడం జరుగుతుందని అన్నారు.
ఈ సమావేశంలో ఇన్చార్జి డి.పి.ఓ.శేషాద్రి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సి.హెచ్ ప్రకాష్, టిఆర్ఎస్ ప్రతినిధి రాజన్న, భాజపా ప్రతినిధి గోపి, సిపిఎం ప్రతినిధి రాజశేఖర్, టిడిపి ప్రతినిధి , వివిధ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.