రాజన్న సిరిసిల్ల జిల్లా :వేసవి వడగాల్పుల నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వేసవి వడ గాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ రాబోయే వేసవి కాలంలో వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి లోని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలని అన్నారు.
మార్చి నుంచి జూలై వరకు ఆశా కార్యకర్త నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు వరకు ప్రతి ఒక్కరి దగ్గర అవసరమైన మేర ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు.
వడ గాల్పుల వల్ల వచ్చే ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల ను వివరిస్తూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.
జిల్లా ఆసుపత్రిలో ఫైర్ ఆడిట్ నిర్వహించాలని అన్నారు.సమ్మర్ హీట్ వేవ్ నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు.
గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలలో త్రాగునీటి సరఫరాకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాల వద్ద చల్లని త్రాగునీరు అందుబాటులో ఉండేలా చలి వేంద్రాల ఏర్పాటు చేయాలని అన్నారు.
వడ గాల్పుల పై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.సాంస్కృతిక సారథి కళాకారులచే ఐ.ఈ.సీ మేటిరియల్ లోని అంశాలను బస్టాండ్, మార్కెట్ వంటి ముఖ్యమైన ప్రదేశాల వద్ద ప్రచారం చేయాలని కలెక్టర్ తెలిపారు.వేసవి కాలంలో ప్రతి రోజు నీరు త్రాగడం, గొడుగు తీసుకుని బయటికి రావడం, వేడి గాల్పులు వచ్చే సమయంలో ఇంట్లో ఉండటం వంటి వివిధ అంశాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు.
జిల్లా అధికారుల ట్విట్టర్, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ , జిల్లా వెబ్ సైట్ లలో కూడా హీట్ వేవ్ నుంచి సంరక్షించేందుకు చేపట్టే జాగ్రత్తల గురించి ప్రచారం చేయాలని అన్నారు.
అంగన్వాడి కేంద్రాలలో ఉన్న టీచర్లు, కార్యకర్తల ద్వారా గ్రామాలలో ప్రచారం చేయాలని అన్నారు.ఉపాధి హామీ పనులకు సంబంధించి సమయాలను చేంజ్ చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో డి.ఎం.హెచ్.ఓ.రజిత, ఇన్చార్జి డిపిఓ శేషాద్రి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి వి.శ్రీధర్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ సిబ్బంది, ప్రోగ్రాం ఆఫీసర్లు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సంబంధిత ఇతర శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.