నల్లగొండ జిల్లా:యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని( Paddy ) కొనుగోలు చేసేందుకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు.జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి వద్ద గొల్లగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వరి కోతలు పూర్తయిన ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముందుగానే ప్రారంభిస్తున్నట్లు, ఈ యాసంగిలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు.వేసవిని దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు, నిర్వహకులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించామన్నారు.
ముఖ్యంగా తాగునీరు,నీడ ఉండేటట్లు చర్యలు తీసుకున్నామన్నారు.ఆశ,అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్లను సైతం సిద్ధంగా ఉంచడమే కాకుండా ఇతర అన్నిరకాల సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు.అంతకుముందు రైతులతో మాట్లాడుతూ వేసవిలో తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, ఆరుతడి పంటలు వేస్తే ఎలాంటి నష్టం రాదని, దిగుబడి సైతం ఎక్కువగా వస్తుందని,మంచి లాభాలు వస్తాయని,లెమన్ గ్రాస్, వాణిజ్యపరమైన రెడ్ చిల్లి, ఎల్లో చిల్లి వంటి ప్రత్యేకమైన పంటలు పండించడం ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చని సూచించారు.అలాగే ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పంటలు పండించాలని,ఇజ్రాయిల్ లాంటి ఎడారి దేశంలో 10,15 రకాల పంటలు పండిస్తున్నారని,ఒకే పంటపై ఆధారపడకుండా వివిధ రకాల పంటలు పండించడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) జె.శ్రీనివాస్,డిసిఓఆర్.కిరణ్ కుమార్,జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,మేనేజర్ నాగేశ్వరరావు,డిఆర్డీఓ నాగిరెడ్డి,మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి శ్రీకాంత్, తహసిల్దారు శ్రీనివాస్,ఆర్జాల బావి ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంచార్జి అనంతరెడ్డి,రైతులు పాల్గొన్నారు.