యాదాద్రి జిల్లా:యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి కిలోన్నర బంగారాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్-కమల దంపతులు సమర్పించారు.
ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ తన వ్యక్తిగతంగా పావుకిలో(25 తులాలు) బంగారం,నియోజకవర్గ ప్రజల తరపున ఒక కిలో 33 తులాలు (మొత్తం 158 తులాల) బంగారాన్ని సమర్పించి,ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత,సీఎం కేసీఆర్ ఒక సంకల్పంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేందుకు ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించాలని నిర్ణయించి ఆదిశగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తెలిపారు.అటువంటి మహా ఆలయ విమాన గోపురాన్ని బంగారు తాపతో చేయాలని తలచి ఎవరికీ వారుగా సహాయం చేయాలనే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మా తుంగతుర్తి నియోజకవర్గం ప్రజల తరుపున కేజీన్నర(158 తులాలు) బంగారాన్ని యాదాద్రి దేవస్థానానికి సమర్పించామని ఎమ్మెల్యే కిశోర్ కుమార్ వెల్లడించారు.
ఈ మహత్తర కార్యక్రమంలో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు కిశోర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పై లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కలకాలం ఉండాలని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల తరుపున యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పేర్కొన్నారు.
రకరకాలుగా మాట్లాడుతున్న నేతలు గతంలో కులాన్ని,మతాన్ని రాజకీయాల కోసం వాడుకున్నారని,దేవాదాయ శాఖ నుంచి నిధులను తీసుకున్నారు గానీ,రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాలయాల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గుర్తు చేశారు.దేవాలయాల అభివృద్ధి విషయంలో గానీ,అర్చకులను పట్టించుకునే విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారని అన్నారు.
నిజమైన హిందువుగా తెలంగాణ ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే సోయి ఉన్న నేతగా ఆయుత చండీయాగం చేసి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ పరితపించారని,నాటి నుంచి తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయని, తెలంగాణ పల్లెలు ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్యే కిశోర్ కుమార్ తెలిపారు.