నల్లగొండ జిల్లా: నల్లగొండలో పలు అధికార కార్యాలయాల్లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల వెనుక దాగి ఉన్న అసలు మర్మం ఏమిటో అర్థంకాక జిల్లా ప్రజలు తలల పట్టుకుంటున్నారు.గతంలో నల్గొండ విద్యాశాఖ అధికారి,మున్సిపల్ ఆఫీసుల్లో ఫైల్స్ భద్రపరిచిన గదుల్లో అగ్నిప్రమాదం జరిగి ఫైళ్లు తగలబడిన విషయం అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే అదే తరహాలో గురువారం అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ తో పాత జెడ్పి ఆఫిస్ లోని ఆడిట్ ఫైళ్ళ రూంలో అగ్నిప్రమాదం సంభవించి కొన్ని పైళ్లు, కంప్యూటర్లు పూర్తిగా కాలిపోగా,మరికొన్ని పాక్షికంగా దగ్ధమయ్యాయి.ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల ఆస్తి నష్టం జరిగిందని,కాలిపోయిన ఫైల్స్ అన్నీ సిస్టంలో భద్రంగా ఉన్నాయని, కాలిపోయిన ఫైల్స్ కూడా 10% మాత్రమేనని ఆడిట్ అధికారి కృపాకర్ తెలిపారు.జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మంటలు ప్రమాదమా?లేక అవినీతి పైళ్లను మాయం చేసే కుట్రకోణం ఏమైనా దాగుందా? అనే దానిపై సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా చర్చ జరుగుతుంది.దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరుతున్నారు.