నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ( BRS party ) ఉచిత పథకాలు పేరిట మళ్ళీ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మోసపూరిత హామీలతో కొత్తవేషంతో వస్తుందని బహుజనులు మరోసారి మోసపోవద్దని బీఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు.సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజల పేదరికాన్ని ఆసరాగా చేసుకొని పథకాలు ఆశచూపి, లేదంటే ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తామని చెదిరించి బీఎస్పీ,ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలను మోసం చేస్తూ బీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు.
ప్రజాస్యామ్యంలో ఎవరికిష్టమొచ్చిన పార్టీలో వాళ్ళు రాజకీయం చేసే స్వేచ్ఛ ఉందని,కానీ, చిరుమర్తి లింగయ్య ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లి తన గెలుపు కోసం స్వచ్ఛందంగా కష్టపడిన ఎందరో నాయకులను, కార్యకర్తలను మోసం చేసారని,అలాంటి వ్యక్తిని నమ్ముకుంటే మోసపోవడం ఖాయమన్నారు.దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తల నరుక్కుంటా అన్న తెలంగాణ మొదటి మోసాన్ని ఇంకా ప్రజలు మర్చిపోలేదని,మీరు ఇస్తామని చెప్తున్న దళిత బంధు పథకం మొదలు పెట్టిన హుజూరాబాద్ లో ఎంత మందికిచ్చారు? పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న నియోజకవర్గాల్లో ఎన్ని కుటుంబాలకు ప్రకటించి, ఎంత మందికిచ్చారు? నకిరేకల్ నియోజకవర్గంలో ఎంత మందికి ఆశ చూపారు?ఎంతమందికి ఇచ్చారు? బీసీ బంధు ఎంత మందికి ఇవ్వడానికి ప్రణాళిక వేశారు?అసలు దాని ఊసేది?అని నిలదీశారు.ప్రజలను అభివృద్ధి చేయడానికి కావల్సిన విద్య,వైద్యం, ఉపాధి ప్రభుత్వాలు కల్పిస్తే అసలు మీరు అంటున్న సంక్షేమ పథకాలు సరైన ఫలితాలనిచ్చేవని,అలా కాకుండా ప్రజలను ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్న కేసీఆర్, బీఆర్ఎస్ ను తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.వేల కోట్ల ప్రజాధనం కొద్దిమంది చేతుల్లోకి పోవడం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమన్నారు.
అభివృద్ధి చేశాననే భ్రమలో ఉన్న ఎమ్మెల్యే లింగయ్య ఇతర పార్టీ కార్యకర్తలను ఎందుకు చేర్చుకుంటున్నారో సెలవివ్వలన్నారు.ఓటమి భయంతోనే ఇలాంటివి చేస్తున్నారని దుయ్యబట్టారు.దళిత బంధు,బీసి బంధు ఇవ్వని రోజు పార్టీలో చేరినవారంతా మీకు బుద్ధి చెప్తారని,ఒకరిద్దరికి ఆశ చూపి మొత్తం జాతిని మోసం చేయడం మీకే చెల్లుతుందని,ప్రజలారా! మన పేదరికానికి కారణమైన వారిని మళ్లీ మళ్లీ నమ్మి మోసపోవద్దని కోరారు