తెలంగాణలో బతుకులేని గిరిజన గ్రామం మాది...!

నల్లగొండ జిల్లా: బంగారు తెలంగాణలో బతకలేని మనుషులుగా ఏళ్ల తరబడి సమస్యల సుడి గుండంలో చిక్కుకొని బతుకులీడుస్తున్న ఓ గిరిజన తండా మాది.నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పిఏ పల్లి మండలంలో 50 ఏళ్ల క్రితం మా గిరిజన గ్రామం బూడిదగట్టు తండా ఏర్పడింది.50 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉన్నదో ప్రస్తుతం కూడా అదే విధంగా ఉండడం బంగారు తెలంగాణలో మా తండా ప్రజలు చేసుకున్న అదృష్టమా అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు మమ్ముల్ని విస్మరించారని, స్వరాష్ట్రంలో మా బతుకులు మారుతాయని ఆశపడ్డాం.

 Nalgonda District Tribal Village Budidagattu Thanda People Facing Problems, Nalg-TeluguStop.com

అనేక రూపాల్లో మా తండా పరిస్థితిని బాహ్య ప్రపంచానికి చాటుతూ అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాం.స్థానిక ఎమ్మెల్యేకు మా గ్రామం ఎట్లుందో కూడా చూసే తీరిక లేదు.

జిల్లా కలెక్టర్లకు మాపై కనికరం లేదు.అసలు మా మొర ఆలకించే నాథుడే కరువయ్యాడని తండా మొత్తం తల్లడిల్లిపోతుంది.

ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా మా తండా యొక్క తలరాత మారలేదని,తండాలో మౌలిక సదుపాయాల కోసం గత కొన్నేళ్లుగా వివిధ రూపాల్లో ఫైట్ చేస్తున్న గ్రామానికి చెందిన వాంకుడోత్ రఘు నాయక్ మరియు దీపావత్ సిరి నాయక్ ఆదివారం మాట్లాడుతూ మా బాధలు పాలకులకు తెలియచేయాలని మీడియాను కోరారు.

మా గ్రామాన్ని ఎవరైనా అధికారులు,ప్రజా ప్రతినిధులు సందర్శిస్తే స్వాతంత్ర్యం వచ్చినట్టుగా భావించే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము.

తండా ఏర్పడి 50 ఏళ్లు దాటినా నేటికి మొత్తం పూరి గుడిసెల్లోనే జీవిస్తున్నాం.గ్రామంలో సిసి రోడ్లు మరియు వీధి లైట్లు లేవు.గ్రామ సర్పంచ్ పట్టించుకోవడం లేదు.రాకపోకలకు రోడ్డు మార్గం లేదు.

బయటి ప్రపచంతో మాకు రవాణా సంబంధం లేదు.విద్యా,వైద్యం ఏళ్ల తరబడి మమ్ముల్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి.

గ్రామంలో ఎవరైనా అనారోగ్యం పాలైనా, ప్రమాదం జరిగినా పట్టణానికి వెళ్ళేలోపే ప్రాణాలు గాల్లోకలుస్తాయి.తాగునీటి సదుపాయం లేదు, మంచినీటి కోసం మా ఊరి నుండి దాదాపు ఒక కి.మీ.దూరం వెళ్ళాలి.వేసవి కాలంలో నీటి కోసం మేము పడుతున్న బాధఅంతా ఇంతా కాదు.

మిషన్ భగీరథ ట్యాంక్ ఉన్నా నీళ్ళు మాత్రం వచ్చే పరిస్థితి లేదు.2014 నుండి కేసీఆర్ పాలనలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టినా ఏ ఒక్క స్కీమ్ కూడా మాకు అందిన పాపాన పోలేదు.సామాజిక పెన్షన్ కొందరికి అందుతున్నా 60 ఏళ్లు పైబడిన వృద్దులు, వికలాంగులు,ఒంటరి స్త్రీలకు ఫించన్ తీసుకోవాలంటే 10-15 కి.మీ.దూరం కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.పోడు భూముల పట్టాలు కూడా అధికార పార్టీ వారికి 10 -15 ఎకరాలు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి, మిగతా వారికి కేవలం 2-3 ఎకరాల భూమికి మాత్రమే పట్టాలు ఇప్పించి చేతులు దులుపుకున్నారు.2012-13 లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ లైన్లు వేయడంతో మొదటిసారి కరెంట్ వెలుగులను చూశాం.అదే మా జీవితంలో జరిగిన ఏకైక అభివృద్ధి.ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెపుతుంటే మాకు కనీసం వ్యవసాయానికి కూడా కరెంట్ ఇచ్చే అవకాశం లేదు.2016-17 నుండి ఎమ్మేల్యే మరియు జిల్లా కలెక్టర్లకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించి, తమ గోడు వినాలని ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించాం.

కానీ,ప్రజా ప్రతినిధులు, అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు.

దాదాపు 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న రవీందర్ కుమార్ మా గ్రామ సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారు.కనీసం మా గ్రామానికి రావడం కూడా మానేశారు.మళ్ళీ ఓట్ల సమయంలో తప్ప మేము వారికి కనిపించే అవకాశం లేదు.పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన మా తండాలో నివసించలేక గ్రామం నుండి సుమారు 10 -15 కుటుంబాలు పట్టణానికి వలస పోయారంటే బంగారు తెలంగాణలో మా తండా ఎంతటి వైభోగం అనుభవిస్తుందో అర్దం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమ బతుకుల్లో నిండిన చీకటిని తొలగించి వెలుగులు ప్రసాదించాలని వేడుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube