నల్లగొండ జిల్లా:అక్రమ సంపాదనే ధ్యేయంగా వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.బుధవారం ఆయన నార్కట్ పల్లిలో మీడియాతో మాట్లాడుతూ నిత్యం జాజిరెడ్డిగూడెం,వంగమర్తి వాగుల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న పనికిరాని మంత్రి అంటూ ఘాటుగా విమర్శించారు.
గతంలో సూర్యాపేట కలెక్టరేట్ నిర్మాణంలోనూ 150 ఎకరాలు దళితుల నుంచి కొనుగోలు చేసి కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించిన విషయం అందరికీ తెలుసన్నారు.నార్కట్ పల్లి పెద్ద చెరువును తన బినామీ జీవన్ రెడ్డితో కలిసి ఆక్రమించారని ఆరోపించాడు.480, 481,550 సర్వే నెంబర్లలో పెద్ద చెరువు లావణ్య పట్టా,బంజారా ఈ భూమి ఉందని తెలిపారు.అక్రమంగా ఏర్పాటు చేస్తున్న ఈ వెంచర్ లో 20 ఎకరాలు ఎఫ్ టి ఎల్ పరిధిలోకి వస్తుందని,10 ఎకరాలు బఫర్ జోన్ లోకి వస్తుందని పేర్కొన్నారు.
పెద్ద చెరువును ఆక్రమించి వందకోట్ల అక్రమ సంపాదనకు మంత్రి జగదీష్ రెడ్డి తెరలేపాడన్నారు.ఇక్కడ ఏర్పాటు చేసిన రోడ్లు,మట్టిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశాడు.కలెక్టర్ కు సైతం ఈ విషయాన్ని తెలిపానని దీనిపై రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్షంగా గ్రామస్తులతో వచ్చి తొలగిస్తామని హెచ్చరించాడు.ఈ చెరువులోకి నీరు వస్తే గ్రౌండ్ వాటర్ పెరిగి రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
నా సొంత మండలంలో చిన్ననాటి నుంచి చూస్తున్న ఈ చెరువును కబ్జా చేయడం సరికాదన్నారు.బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేసి నార్కట్ పల్లి చెరువు నింపాల్సి ఉంది.
దాన్ని వదిలేసి చెరువును అమ్ముకోవడం మంచి పద్ధతి కాదన్నాడు.