ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం విషయంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.మద్యం బ్రాండ్లకు అనుమతిని ఇచ్చారంటూ అటు టీడీపీ, ఇటు వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా మద్యనిషేధంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
వైసీపీ మేనిఫెస్టోలో అలాంటి హామీనే ఇవ్వలేదని అన్నారు.పైగా ఆ మాటే తమ మేనిఫెస్టోలో లేదని.
కావాలంటే వెళ్లి చూసుకోండి అంటూ సవాల్ చేశారు.రాష్ట్రంలో గతంలో 45 వేల బెల్ట్ షాపులు ఉండేవని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క బెల్ట్ షాపు కూడా లేకుండా చేశామని ఆయన తెలిపారు.
విశాఖలో మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అయితే, వైసీపీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జగన్.
ఇప్పుడు మాట తప్పి మడమ తిప్పారంటూ టీడీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.కల్తీ బ్రాండ్లను తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.
జే బ్రాండ్స్ పోవాలి.జగన్ దిగిపోవాలంటూ నినాదాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళలు వినూత్న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

మద్యమే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అదేవిధంగా ప్రభుత్వ దుకాణాల్లో రకరకాల బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.మద్యం కారణంగా కుటుంబాల్లో కలతలు చెలరేగి, ఎంతోమంది బ్రతుకులు నాశనమవుతున్నాయని మండిపడుతున్నారు.
టీడీపీ నిరసనల నేపథ్యంలో ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా.? లేదా మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తుందా.? మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దశలవారీగా మద్య నిషేధం అమలు హామీని నేరవెరుస్తుందా అనేది వేచి చూడాల్సిందే.