సూర్యాపేట జిల్లా:గతంలో అసెంబ్లీ సాక్షిగా ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఐకెపి సెంటర్లను మూసివేసి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు విమర్శించారు.
శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ధాన్యం నేనే కొంటున్నానని రైతులను కేసీఆర్ మోసం చేశారని,తెలంగాణ రైతుల ధాన్యాన్ని ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర రైతులకు తెలిసిపోయిందని అన్నారు.మంత్రి హరీష్ రావు నూకలు అయినా తింటాం అవమానాన్ని భరించం అంటూ తెలంగాణ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని,కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటలకు కాలం చెల్లిపోయిందన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ విధానం మారలేదని,రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కు అధికారం ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం పై నిందలు వేస్తూ,అవినీతికి పాల్పడుతూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
అధికారం ఉన్నా పాలన చేతకాని కేసీఆర్ ను పక్కన పెట్టి,వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి తెలంగాణ రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.