సూర్యాపేట జిల్లా: గత ప్రభుత్వ చేసిన పాపాలను గత నాలుగు నెలలుగా కాంగ్రెస్ పార్టీ వెలికితీస్తుందని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుఅన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం చేసిన పాత నేరాలన్ని ఒక్కోటి బయటకు వస్తున్నాయని వివరించారు.
ఒక వైపు గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరుపుతూనే కేసీఆర్ పాపాల ప్రక్షాళన కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టిందన్నారు.బీజేపీ, కేసీఆర్ రైతు దీక్షలు చూసి సమాజం నవ్విపోతుందన్నారు.
గత పదేళ్లలో రైతులకు బీజేపీ, బీఆర్ఎస్ లో చేసిందేమిటో వివరించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలే అయినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీలు అడ్డగోలు విమర్శలు చేయడం సరికాదన్నారు.
బీజేపీ గత పదేళ్ళుగా రైతులకు ఏం చేసిందని ప్రశ్నిస్తూ కిషన్ రెడ్డి దీక్ష చేయడం సిగ్గుచేటు అన్నారు.కిషన్ రెడ్డి దీక్ష చేయాలనుకుంటే రైతులకు వారి ప్రభుత్వం ఏం చేసిందో వివరించి దీక్ష చేయాలన్నారు.
పదేళ్ళుగా బీజేపీ చేయనివి, చేయలేనివి కేవలం నాలుగు నెలల్లో కాంగ్రెస్ చేయాలని ఎలా ప్రశ్నిస్తారని ఆయన మండిపడ్డారు.పదేళ్ళు బీజేపీ,కేసీఆర్ లు రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు.
నాలుగు నెలల్లో కాంగ్రెస్ కొంతైనా ప్రజలకు మేలు చేస్తుందని, ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేశారని చెప్పారు.ఎన్నికల కోడ్ వల్లే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో ఆలస్యం అవుతుందని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని అంతా ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.
సంక్షేమం పట్టించుకోకపోతే బీజేపీ,బీఆర్ఎస్ కి వేసిన శిక్షే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా వేస్తారని తెలిపారు.
కేవలం నాలుగు నెలల పరిపాలన కాలానికి బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు అంత ఉలుకని ధ్వజమెత్తారు.ఎవరు అవునన్నా,కాదన్నా కమ్యూనిస్టులు బలపరిచిన కూటమికే రానున్న ఎన్నికల్లో విజయం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.
కమ్యూనిస్టుల తో చేస్తున్న స్నేహం కాంగ్రెస్ పార్టీకికి కలిసి వస్తుందన్నారు.
గతంలో ఎకరాకు 10 వేలు పంట నష్టపరిహారం ఇస్తానన్న కేసీఆర్ అవి ఇవ్వలేదు గాని ఇప్పుడు 25 వేలు ఇవ్వాలని అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు.అకాల వర్షాలకు,సాగు నీరు లేక ఎండిన పంటలకు ఎకరాకు 10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
ఆయన వెంట సిపిఐ నాయకులు పల్లా వెంకటరెడ్డి,బెజవాడ వెంకటేశ్వర్లు,బూర వెంకటేశ్వర్లు ఉన్నారు.