- ప్రారంభ తేదీలు తలకిందులు నాలుగు సంవత్సరాలుగా అద్దె భవనంలోనే అధికారుల విధులు
ఇంకా సగం పనులే పూర్తి
సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.దానికి అనుగుణంగా ప్రజా పాలన వేగవంతం చేసేందుకు నూతన జిల్లాల్లో నూతన కలక్టరేట్ భవనాల నిర్మాణం చేపట్టిన విషయం కూడా విదితమే.
ఇంత వరకు బాగానే ఉన్నా కొన్ని జిల్లాల్లో నూతన భవనాలు ప్రారంభమైనా,ఇంకా కొన్ని జిల్లాల్లో అద్దె భవనాలలోనే తమ విధులను కొనసాగిస్తున్నారు.అందులో భాగంగా సూర్యాపేట జిల్లాగా ఏర్పాడి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు మాత్రం నడకన సాగుతున్నాయి.
ప్రస్తుత అద్దె భవనంలో నిర్వహిస్తున్న కలెక్టరేట్ జిల్లా కేంద్రానికి 6 కిలో మీటర్ల దూరంలో ఉండటం వలన అక్కడికి ప్రజలు వెళ్ళి తమ సమస్యల్ని చెప్పుకోవాలంటే పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అంతేకాక సమయానికి రవాణా సౌకర్యాలు లభించకపోవడం, కలెక్టరేట్ కు వచ్చినా సమస్యకు వెంటనే పరిష్కారం లభించకపోవడంతో మళ్ళీ మళ్ళీ రావాల్సి రావడంతో దూర ప్రాంతాల నుండి వస్తున్న ప్రజలు కొందరు ఈ విషయంపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.2018 లో సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని కుడకుడ గ్రామ శివారు ప్రాంత రెవెన్యూ పరిధిలో 21 ఎకరాల స్థలం కేటాయించి,అందులో నూతన కలెక్టరేట్ పనులను ప్రారంభించారు.అయితే 2019 లోనే ఈ నూతన భవనం పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా సగం పని మిగిలే ఉండడంతో కొత్త కలెక్టరేట్ కాస్త పాత మరుపు అవుతుందనే భావన జిల్లా ప్రజల్లో నెలకొంది.
ఇదిలా ఉండగా స్థానిక ఎమ్మెల్యే,మంత్రి జగదీష్ రెడ్డి,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పలుమార్లు భవన నిర్మాణాన్ని పర్యవేక్షించి అధికారులను నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించినా పనులు మాత్రం మందకొడిగా నడుస్తుండడం గమనార్హం.సగం పనులకే నాలుగు సంవత్సరాల సమయం దాటితే,భవనం పూర్తవడానికి ఇంకెంత కాలం పడుతుందో తెలియని స్థితిలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం పరిస్థితి ఉందని జిల్లా ప్రజలు మాట్లాడుకుంటున్నారు.