తెలంగాణ రాజకీయాలు అధికార పక్షం పై విమర్శలు, ప్రతి విమర్శలతో హాట్ హాట్ గా మారిన పరిస్థితి ఉంది.బీజేపీ అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
కాగా నేడు నిరుద్యోగులకు నోటిఫికేషన్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు.నీళ్ళు, నిధులు, నియామకాల కొరకు పోరాటం జరిగిన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డాక నిరుద్యోగులు పెద్ద ఎత్తున దగాకు గురయ్యారని, వయస్సు పెరుగుతున్నా ఇంకా ఉద్యోగం సాధించక పోవటంతో నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అందుకు ప్రధాన కారణం కెసీఆర్ మాత్రమేనని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంలో లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఇప్పటికీ భర్తీ ఎందుకు చేయడం లేదని ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ల విషయంపై ఒక స్పష్టత ఇచ్చే వరకు భారతీయ జనతాపార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటుందని భారతీయ జనతాపార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.అయితే నేడు చేపట్టబోయే దీక్షతో ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగాల ప్రకటన విడుదల చేస్తుందా అంటే ఒకింత ప్రశ్నార్థకమనే చెప్పాలి.
ఎందుకంటే ఇప్పటికే కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో జనవరి 20 వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆ తరువాత ఉద్యోగాల భర్తీపై ఒక స్పష్టమైన ప్రకటన అనేది ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఎందుకంటే ప్రణాళికా బద్ధంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టకుంటే న్యాయ పరమైన చిక్కులు ఎదురవుతాయని అందుకే చాలా జాగ్రత్తగా ప్రభుత్వం అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.