యూఏఈకి లాభం కలిగేలా వ్యవహరించడంతో పాటు ఆ దేశానికి ఏజెంట్లా పనిచేశారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రుడు టామ్ బరాక్ బెయిల్ ద్వారా విడుదలయ్యారు.ఇందుకోసం ఆయన అక్షరాల 250 మిలియన్ల డాలర్ల బాండ్‌తో పాటు 5 మిలియన్ డాలర్ల నగదును కోర్టుకు చెల్లించారు.
అలాగే బరాక్ జీపీఎస్ లోకేషన్ మానిటరింగ్ బ్రాస్లెట్ ధరించాలని న్యాయమూర్తి ఆదేశించారు.విదేశాలకు నిధులు చెల్లించకుండా ఆయన ఖాతాలను ఫ్రీజ్ చేశారు.
దీనితో పాటు బరాక్‌ను దక్షిణ కాలిఫోర్నియా, న్యూయార్క్ ప్రాంతాలకే పరిమితం కావాలని జడ్జి ఆదేశించారు.
వాస్తవానికి బరాక్ సోమవారం బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరుకావాలి.
అయితే ఆయన తన నేరాన్ని అంగీకరించకూడదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ కేసులో బరాక్‌తో పాటు మరో ప్రతివాది మాథ్యూ గ్రిమ్స్ కస్టడీ నుంచి విడుదలయ్యారు.5 మిలియన్ల బాండ్‌పై గ్రిమ్స్‌ను విడుదల చేయాలని, అలాగే జీపీఎస్ ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్ ధరించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
లాస్ ఏంజిల్స్‌లో మంగళవారం టామ్ బరాక్‌ను అరెస్ట్ చేశారు.
అనంతరం మేజిస్ట్రేట్ ప్యాట్రిసియా డోనాహ్యూ ఎదుట ఆయనను హాజరుపరిచారు.కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం అమెరికా న్యాయశాఖ అతనిని అరెస్ట్ చేసి, న్యూయార్క్‌కు తరలించాల్సిందిగా కోరింది.
అలాగే అతని సంపద, విదేశాలతో సంబంధాల వల్ల ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అతని తరలింపుపై ఆందోళన వ్యక్తం చేసింది.ఈ కేసులో మరో ప్రతివాది రషీద్ సుల్తాన్ రషీద్ అల్ మాలిక్ అల్షాహిని 2018లో ఎఫ్‌బీఐ విచారించింది.
కానీ ఆ మూడు రోజులకే అతను అమెరికా నుంచి పారిపోయాడు.యూఏఈ, సౌదీ అరేబియా రెండింటిలోని సీనియర్ నాయకులతో టామ్ బరాక్కు సంబంధాలు వున్నాయని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.
అమెరికాతో నేరస్తులను అప్పగించే ఒప్పందాలు లేని ఈ రెండు దేశాలకు బరాక్ తన ప్రైవేట్ విమానంలో పారిపోతే.ఆ దేశాల అత్యున్నత నాయకుల సాయం పొందుతాడని ప్రాసిక్యూటర్లు అనుమానం వ్యక్తం చేశారు.

కాగా, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తరపున బరాక్ అక్రమంగా లాబీయింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.దీని వల్ల 2016లో ట్రంప్ ఎన్నికల ప్రచారంతో పాటు అమెరికా విదేశీ విధానంపై నేరుగా ప్రభావం పడిందని బ్రూక్లిన్‌లోని ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు.ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్ఎన్ కథనం ప్రకారం.ఏప్రిల్ 2016 నుంచి ఏప్రిల్ 2018 మధ్య కాలంలో యూఏఈకి ఏజెంట్‌గా వ్యవహరించినందుకు గాను బరాక్‌పై ఏడు కౌంట్ల నేరారోపణలు నమోదు చేశారు.
న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించడంతో పాటు ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లకు తప్పుడు ప్రకటనలు చేయడం వంటి అభియోగాలు కూడా ఆయనపై వున్నాయి.బరాక్‌తో పాటు కొలరాడోకి చెందిన మాథ్యూ గ్రిమ్స్, యూఏఈ జాతీయుడు రషీద్ సుల్తాన్ రషీల్ అల్ మాలిక్ అల్షాహిపైనా అభియోగాలు మోపారు.

2016, 2017లలో టీవీ ప్రదర్శనల కోసం బరాక్, అల్షాహి, గ్రిమ్స్లు యూఏఈ అధికారుల నుంచి టాకింగ్ పాయింట్లను అందుకున్నారు.ఇందులో బరాక్ యూఏఈ ప్రయోజనాలను ప్రోత్సహించినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.2016లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత వీరు ముగ్గురు.యూఏఈ ఆదేశాల మేరకు ఆ దేశ ప్రయోజనాలను కొనసాగిస్తూనే వున్నారు.2016 డిసెంబర్లో బరాక్, గ్రిమ్స్, అల్షాహిలు యూఏఈ సీనియర్ ప్రభుత్వ అధికారులతో ఒక సమావేశానికి సైతం హాజరయ్యారు.యూఏఈ సీనియర్ అధికారులతో టచ్‌లో వుండటానికి బరాక్ ఒక మేసేజింగ్ యాప్‌తో పాటు సెల్‌ఫోన్‌ను వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది.