రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో పిల్లల చదువులు, చెల్లెళ్ల పెళ్లి, కుటుంబ అవసరాల కోసం పొట్ట చేతపట్టుకుని పరాయి గడ్డ మీదకు అడుగుపెట్టాడు ఓ భారతీయుడు.చిన్న కంపెనీలో పని చేస్తూ కుటుంబానికి డబ్బు పంపేవాడు.
సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంపై విధి చిన్న చూపు చూసింది.కుటుంబానికి ఆధారంగా వున్న వ్యక్తిని మృత్యువు కబళించింది.
వీరి పరిస్ధితిని చూసి చలించిపోయిన ఓ స్వచ్ఛంద సంస్థ పెద్ద మనసుతో విరాళాల సేకరణకు ముందుకొచ్చింది.
వివరాల్లోకి వెళితే.
భారత్‌లోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మారిముత్తుకు నలుగురు చెల్లెళ్లు, తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు వున్నారు.కూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన .పన్నేండేళ్ల క్రితం సింగపూర్‌కి వెళ్లాడు.అక్కడైతే తన అవసరాల కు సరిపడా డబ్బు దొరకుతుందని కుటుంబ పరిస్ధితి మారుతుందని మారిముత్తు ఆశించాడు.
ఫైర్ ప్రొటెక్షన్ సేవలను అందించే స్టార్స్ ఇంజనీరింగ్ అనే కంపెనీలో ఆయన పనిచేస్తున్నాడు.తనకు వచ్చిన జీతాన్ని ఇంటికి పంపేవాడు.కష్టాలు తొలగిపోతున్నాయని భావిస్తున్న దశలో మారిముత్తుపై విధి పగబట్టింది.గత బుధవారం అతను పనిచేసే కంపెనీలో భారీ పేలుడు సంభవించింది.
ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన మారిముత్తు ప్రాణాలు కోల్పోయాడు.
ఇక్కడ విషాదం ఏంటంటే.
సైట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మారిముత్తు భార్య గతేడాది ఏప్రిల్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది.అయితే ఆ బిడ్డను స్వయంగా చూడకుండానే అతను ఈ లోకం విడిచి వెళ్లిపోవడం బాధాకరం.
గతేడాది కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో మారిముత్తు భారత్‌కు రావడం సాధ్యపడలేదు.దీంతో వీడియో కాల్ ద్వారానే కూతురిని చూసుకునేవాడాయన.
చివరికి రేపు చనిపోతాననగా కుటుంబసభ్యులందరితో సరదాగా మాట్లాడాడు.కానీ అవే ఆయన చివరి మాటలు అవుతాయని అనుకోలేదని మారిముత్తు కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
కుటుంబానికి ఆధారంగా వున్న వ్యక్తి ఇలా అర్థాంతరంగా చనిపోవడంతో వారు రోదిస్తున్నారు.వీరి పరిస్ధితి తెలుసుకున్న Give.Asia అనే ఆన్‌లైన్ ఛారిటీ మారిముత్తు కుటుంబసభ్యులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.వీరి ప్రయత్నం ఫలించి ఆదివారం నాటికి 2 లక్షల సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.84 లక్షలు) విరాళాల రూపంలో వచ్చాయి.ఆన్‌లైన్‌లో మారిముత్తు కుటుంబ పరిస్ధితికి చలించి 2,141 మంది దాతలు విరాళాలు అందించారు.
ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆకాష్ అనే వాలంటీర్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించారు.త్వరలోనే ఈ ఆర్ధిక సాయాన్ని మారిముత్తు కుటుంబసభ్యులకు అందజేసే అవకాశం వుంది.