పౌరసత్వ సవరణ చట్టంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్‌లో మొదలైన ఈ నిరసనలు రాజధాని ఢిల్లీని కూడా తాకాయి.
అయితే ఇందులో ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏంటని కొందరు వాదిస్తున్నారు.ఇదంతా కాంగ్రెస్ కావాలని చేయిస్తున్న పనే అని అధికార బీజేపీ కొట్టి పారేస్తోంది.

అయితే కేవలం పౌరసత్వ సవరణ చట్టాన్ని మాత్రమే చూస్తే పెద్దగా ఏమీ అనిపించదు.కానీ దీనిని ఎన్‌ఆర్‌సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)తో కలిపి చూస్తే దీనివల్ల ఎంత ప్రమాదమో తెలుస్తుంది అంటూ ఓ పోస్ట్ వాట్సాప్‌లో వైరల్ అవుతోంది.పౌరసత్వ సవరణ చట్టం ఏం చెబుతోంది.పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే ముస్లిమేతరులకు మాత్రమే భారత పౌరసత్వం కల్పిస్తామని.అంతే కదా.
ఇప్పుడు దీనిని ఎన్‌ఆర్‌సీతో కలిపి చూద్దాం.కేవలం అస్సాంలో అమలు చేసిన ఈ ఎన్‌ఆర్‌సీని త్వరలోనే దేశవ్యాప్తంగా చేస్తామని హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు.ఈ ఎన్‌ఆర్‌సీ ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరూ ఇప్పుడు తాము భారతీయులమే అని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
కేవలం గుర్తింపు ఉంటే సరిపోదు.తమ పూర్వీకులు ఈ ప్రాంతానికి చెందిన వాళ్లు అన్న ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.

అస్సాంలో ఇలాగే జరిగింది కాబట్టే కొన్ని లక్షల మందికి భారత పౌరసత్వం దక్కలేదు.ఎన్‌ఆర్‌సీ ప్రకారం పూర్వీకులు ఇక్కడి వాళ్లే అన్న ఆధారాలు చూపించకపోతే వాళ్లు భారతీయులు కాకుండా పోతారని, అయితే పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ముస్లిమేతరులకు ఎలాగూ భారత పౌరసత్వం దక్కుతుంది కాబట్టి వాళ్లకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నది ఆ పోస్ట్ సారాంశం.
ఎటొచ్చీ ఓ వర్గానికి మాత్రమే ఎన్‌ఆర్‌సీతో కలిపి చూసినప్పుడు పౌరసత్వ సవరణ చట్టం చాలా ప్రమాదకరంగా మారుతుందని, ఎన్నో ఏళ్లుగా దేశంలోనే ఉంటున్నా పౌరసత్వం కోల్పోయే పరిస్థితి వస్తుందన్న ప్రచారం మొదలైంది.ఇప్పటికే ఇలాంటి వాళ్ల కోసం ప్రభుత్వం డిటెన్షన్ సెంటర్లను కూడా నిర్మిస్తోంది.
ఈ కారణంగానే పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.