ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ పిండి వంటలతో ఘమఘమలాడింది.108 రకాల పిండివంటలతో పాటు ఇంట్లో నిత్యం చేసుకునే ఆహార పదార్థాలను కూడా కలెక్టరేట్లో మహిళలు స్వయంగా తయారు చేశారు.కలెక్టరేట్లో పిండివంటలు తయారు ఏంటి అనుకుంటున్నారా.ఇది పక్కాగా ప్రభుత్వ కార్యక్రమం.ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం అన్ని విధాలుగా పోషక విలువలు కలిగి ఉన్నాయనే సంకేతాన్ని రేషన్ కార్డ్ దారులకు ఇవ్వడానికి ప్రభుత్వం తాజాగా ఈ పిండి వంటలు కార్యక్రమాన్ని కలెక్టరేట్లో నిర్వహించింది.

ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంతో పిండివంటలతో పాటు నిత్యం ఇంట్లో తినే ఆహార పదార్థాలు కూడా తయారు చేసుకోవచ్చని తెలియజేస్తూ రేషన్ బియ్యంతో పిండి వంటల పోటీలను అధికారులు నిర్వహించారు.ఈ పోటీలో సుమారుగా 108 మంది మహిళలు పాల్గొని అక్కడికక్కడే పిండి వంటలను తయారు చేశారు.నోరూరించే బిర్యానీ, జీరా రైస్, తాటి గారెలు, పులిహార , చక్ర పొంగలి, దోశలు, ఇడ్లీ, పాయసం, కట్ లైట్ లు, పూరీలు లాంటి 108 రకాల పిండివంటలను మహిళలు తయారు చేశారు.
కలెక్టర్ పి ప్రశాంతి స్వయంగా ఈ వంటలను పరిశీలించి రుచి చూశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ బియ్యం లో న్యూట్రిషన్ పదార్థాలు ఉన్నాయని, కాబట్టి ప్రతి రేషన్ కార్డ్ లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని వినియోగించుకోవాలని, ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులకు ఈ రేషన్ బియ్యం పోషక విలువలు అందిస్తుందని వెల్లడించారు.జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయని, అయితే రేషన్ బియ్యం లో ఉన్న పోషక విలువలు ఇతర రకాల బియ్యం లో లేవని, కాబట్టి రేషన్ కార్డు ధరలు ఈ బియ్యాన్ని వాడుకోవాలని సూచించడానికి ఈ వంటల పోటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.