గత కొద్ది రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో పాటు, ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఏ విధంగా చేయాలి అనే విషయం పైన ఎక్కువ దృష్టి సారించారు.ఈ క్రమంలోనే బిజెపి పై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తూ , ఆ పార్టీపై విమర్శలు చేస్తూ వస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ కు టిఆర్ఎస్ ప్రాధాన్యమివ్వడం , ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో భేటీ అయ్యే సమయంలోనూ కేసీఆర్ వెంట ప్రకాష్ రాజు వెళ్లడం రాజకీయం చర్చనీయాంశమైంది.
తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ కేసీఆర్ తో భేటీ అయ్యారు.ఎర్రవల్లి లోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి ప్రకాష్ రాజ్ వెళ్లారు.
సుమారు నాలుగు గంటలపాటు అక్కడే ఉండి ఆయన చర్చలు జరిపారు.అయితే కెసిఆర్ ప్రకాష్ రాజ్ మాత్రమే కాకుండా, ఈ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం.
ఈ ముగ్గురు భేటీలో దేశ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందట.కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది.
వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కకుండా చేయడం ఎలా అనే విషయం పైన, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం పైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారట.
దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేసి, బీజేపీకి అధికారం దక్కకుండా చేయాలని విషయం పైనే ఎక్కువగా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.అంతేకాదు జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేసే బాధ్యతలను టిఆర్ఎస్ తరఫున ప్రకాష్ రాజుకు అప్పగించినట్లు సమాచారం.ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలతో ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగబోతున్నారు.
టిఆర్ఎస్ తరఫున ఢిల్లీలో ఆ పార్టీకి చెందిన నాయకులు చాలామంది ఉన్నా, ప్రత్యేకంగా ప్రకాష్ రాజ్ కు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక కారణాలు ఏమిటనేది టీఆర్ఎస్ కీలక నేతలతో కూడా అంతు పట్టడం లేదట.