కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో సఖ్యత కోసం ప్రయత్నిస్తూ వస్తోన్న ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలిసారిగా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసింది.ఇప్పటి వరకు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో కయ్యం ఎందుకు అంటూ రాజీ ధోరణితో వస్తోన్న రాష్ట్ర ప్రభుత్వానికి వరుసగా కేంద్రం అన్యాయం చేస్తుండడంతో రగిలిపోతోంది.
దీంతో తొలిసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు తాము తాడోపేడో తేల్చుకునేందుకు రెడీగా ఉన్నామని చెపుతున్నారు.

తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కనిపించడం లేదు.దీంతో కేంద్ర బడ్జెట్‌పై విజయసాయిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇది చెత్త బడ్జెట్ అంటూ ఆయన ఆగ్రహానికి గురయ్యారు.
రాష్ట్రాలపై కేంద్రానికి ఎప్పుడూ సవతి తల్లి ప్రేమే అన్న ఆయన ఎన్నికల లబ్ధి కోసమే ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై కేంద్రం వరాలు కురిపించిందని ఆరోపించారు.ఏపీకి ప్రత్యేక హోదా అన్న విషయమే కేంద్రానికి గుర్తు లేదని విశాఖ, విజయవాడ మెట్రోలను తాము ఎప్పటి నుంచో అడుగుతున్నా కేంద్రం పట్టించు కోవడం లేదని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో 26 జిల్లాలో చేస్తున్నందున వాటికి కేంద్రీయ విద్యాలయాలు అయినా ఇవ్వాలని కోరిన విజయసాయి పోలవరం సవరించిన అంచనాల గురించి ప్రస్తావనే లేదన్నారు.అటు వైసీపీ లోక్ సభాపక్షనేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, విభజన హామీల ప్రస్తావనే లేదన్నారు.
బడ్జెట్ చాలా నిరుత్సాహ పరిచే విధంగా ఉందన్నారు.ఏదేమైనా గత బడ్జెట్‌ను కూడా వైసీపీ ఎంపీలు పొగిడారు.
ఇక ఓపిక పట్టి పట్టి వాళ్లకు కూడా విసుగు వచ్చినట్టే కనపడుతోంది.
కేంద్రం తమను వాడుకుని వాళ్ల అవసరాలు తీర్చుకుంటుందే తప్పా తమ అవసరాలు తీరడం లేదని గ్రహించిన వైసీపీ ఎంపీలు విమర్శలకు దిగక తప్పడం లేదు.
మరి ఇది భవిష్యత్తులో ఏ స్థాయికి వెళుతుందో ? చూడాలి.