గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అంటూ మహానుభావులు అంటూ ఉంటారు.అలాంటి పల్లెలు దుర్బరమైన పరిస్థితుల మద్య మగ్గుతున్నాయి.
పల్లెల్లో అభివృద్ది కనిపించక పోవడం వల్లే దేశం ఇంకా అభివృద్ది చెందుతున్న దేశంగానే ఉందనిపిస్తుంది.అయితే పల్లెలు అభివృద్ది చెందక పోవడంకు కారణం పల్లె వాసులే అని చెప్పక తప్పదు.
కొన్ని పల్లెల్లో మాత్రం అభివృద్ది బాగా జరిగితే కొన్ని చోట్ల మాత్రం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇలాంటి సమయంలో మహారాష్ట్రలోని పటోదా గ్రామం అందరికి ఆదర్శనీయంగా ఉంటుంది.పక్క గ్రామాలకు పటోదా గ్రామానికి ఉండే తేడా నక్కకు నాగలోకంకు ఉన్నంత తేడా ఉంటుంది.
పటోదా గ్రామంలో ప్రతి అడుగు అడుగున అభివృద్ది కనిపిస్తూ ఉంటుంది.ప్రతి చోట కూడా అద్బుతమైన ప్రయోజనాలు ఇచ్చే పనులు జరిగాయి.గత పదేళ్లుగా ఈ గ్రామంలో కరువు అనేది లేదు.మొన్నటి ఎండాకాలంలో మహారాష్ట్ర మొత్తంలో కూడా కరువుతో జనాలు చాలా ఇబ్బంది పడ్డారు.
కాని ఇక్కడ ప్రజలు మాత్రం కరువు అనే పదాన్ని మర్చి పోయారు.ఎప్పుడు, ఎక్కడ చూసినా కూడా నీరు సమృద్దిగా ఉంటుంది.
గ్రామంలో నీటి వనరులను సంరక్షించుకునేందుకు చేసే పనులు అన్ని ఇన్ని కావు.

చుట్టు పక్కల ఊర్లో వారికి అమ్మాయిని ఇచ్చేందుకు తల్లిదండ్రులు భయపడతారు.కాని పటోదా గ్రామానికి మాత్రం అమ్మాయిని ఇచ్చేందుకు ఎగిరి గంతేస్తారు.ఎందుకంటే నీటి సమస్య అస్సలు ఉండదు.
ఇతర గ్రామాల నుండి వచ్చిన అమ్మాయిలు తాము నీటి కోసం ప్రతి రోజు రెండు మూడు గంటల పాటు కష్టపడే వాళ్లం.కాని పెళ్లి అయ్యి వచ్చిన మాకు మాత్రం ఇక్కడ అలాంటి కష్టం ఏమీ లేదు అంటున్నారు.
ప్రతి విషయంలో కూడా ఈ గ్రామ వాసులు దేశానికే ఆదర్శనీయంగా నిలుస్తున్నారు.ప్రతి నెల నీటి బిల్లు, పారిశుద్ద బిల్లు ఇంకా అనేక రకాల బిల్లులు చెల్లించడంతో పాటు, ప్రతి సంవత్సరం కూడా గ్రామ అభివృద్దికి సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను అందుకున్న ఈ గ్రామం ముందు ముందు మరిన్ని గ్రామాలకు ఆదర్శనీయం కావాలని ఆశిద్దాం.