ఆయన ఓ రాష్ట్రానికి డీజీపీ.రాష్ట్రంలోని శాంతిభద్రతలను కాపాడటం ఆయన బాధ్యత.
కానీ ఏకంగా ప్రతిపక్ష నేత ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్లు, చెప్పులు విసిరిన ఘటనపై ఆయన స్పందించిన తీరు విస్మయం కలిగిస్తోంది.అమరావతిలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మరీ ఓ అధికార పార్టీ నేతలాగా మాట్లాడారు.

చంద్రబాబుకు అనుమతి ఇచ్చాం కాబట్టి ఇలా జరిగింది.ఒకవేళ ఇచ్చి ఉండకపోతే ఇంకా పెద్దగానే జరిగేదని సవాంగ్ వ్యాఖ్యానించడం గమనార్హం.అయినా ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, చంద్రబాబుపైకి చెప్పు విసిరింది ఓ రైతు అని ఆయన అన్నారు.సవాంగ్ అక్కడితో ఆగలేదు.ఒకవైపే కాదు.రెండో వైపు కూడా చూడాలంటూ మీడియాకే హితబోధ చేయడం విశేషం.

రాళ్లు, చెప్పులు వేసిన వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకున్నాం.అయితే ఇలా దాడి చేయడానికి కారణాన్ని వాళ్లు వివరించారు.అందులో ఒకరు రైతు, మరొకరు రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన వ్యాపారవేత్త ఉన్నారు.చంద్రబాబు వల్ల నష్టపోయాం కాబట్టే ఇలా చేశామని చెప్పారు.ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అని గౌతమ్ సవాంగ్ అన్నారు.
సాధారణంగా డీజీపీ స్థాయి అధికారులు ఇలా ఓ పొలిటికల్ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లుగా మాట్లాడరు.
జరిగిన సంఘటనను వివరించి, తమ శాఖ చేపట్టిన చర్యలను చెబుతుంటారు.కానీ గౌతమ్ సవాంగ్ మాత్రం ఒకరకంగా దాడిని సమర్థిస్తున్నట్లుగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది.