ఆడ పిల్లలంటే ఆటబొమ్మలుగా చూసే మనుషులు సమాజంలో ఇంకా ఉన్నారు.ఆడ పిల్ల పుడితే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినంత సంబరపడిపోతారు చాలా మంది.
కానీ కొంత మంది మాత్రం ఆడపిల్ల అంటే భారంగా భావిస్తారు.వారిని ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసి వదిలించుకోవాలని చూస్తారు.
కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే విషయం ఇంత కన్నా ఘోరంగా ఉంది.
కన్న కూతురునే 10 వేల రూపాయలకు అమ్మేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ఆ తల్లిదండ్రులు 12 సంవత్సరాల కూతురుని 46 సంవత్సరాల వ్యక్తికి అమ్మేసారు.అతడు ఆ బాలికను పెళ్లి చేసుకుని వారి బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు.అర్ధరాత్రి ఆ బాలిక ఏడుపు విన్న చుట్టూ పక్కల వారు ఆ ఊరు సర్పంచ్ కు సమాచారం అందివ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన చిన సుబ్బయ్య అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన పేద కుటుంబంలో ఒక అమ్మాయి మీద కన్నేశాడు.చిన సుబ్బయ్య భార్య కొద్దిరోజుల క్రితం ఇంట్లోనుండి వెళ్లి పోవడంతో అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాడు.
ఆ పేద కుటుంబంలోని 12 సంవత్సరాల బాలికను దక్కించుకోవడం కోసం వారికి డబ్బును ఆశగా చూపించాడు.
ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు.
ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో భాదపడుతున్నారు.దీన్ని ఆసరాగా చేసుకున్న సుబ్బయ్య ఆ బాలికను 10 వేల రూపాయలు ఇచ్చి కొన్నాడు.
ఆ తర్వాత ఆ బాలికను పెళ్లి చేసుకుని పక్క ఊరిలో ఉన్న బంధువు ఇంటికి తీసుకెళ్లాడు.
అర్ధరాత్రి సమయంలో ఆ బాలిక ఏడుస్తున్న అరుపులు విన్న చుట్టూ పక్కలవారు ఆ విషయాన్నీ ఆ ఊరు సర్పంచ్ కు తెలియచేసారు.
దీంతో ఆయన వెంటనే గ్రామా సచివాలయం సిబ్బందికి విషయం చెప్పడంతో వారు ఐసిడిఎస్ అధికారులకు తెలియచేసారు.ఆ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని బాలికను శిశుసంరక్షణ కేంద్రానికి తరలించి నిందితులపై కేసు నమోదు చేసారు.