యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( US President Donald Trump )తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు హాట్‌టాపిక్ గా మారింది.సాధారణంగా నేరస్తులను తరలించడానికి వాడే సైనిక విమానాలను అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ఉపయోగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇటీవల ఫిబ్రవరి 4న టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుంచి 205 మంది భారతీయ వలసదారులను C-17 గ్లోబ్‌మాస్టర్ III సైనిక విమానంలో( C-17 Globemaster III military aircraft ) భారత్ కు తిప్పి పంపిన సంగతి తెలిసిందే.ట్రంప్ కఠినమైన వలస విధానాలలో ఇది ఒక భాగం మాత్రమే.
“అక్రమ వలసలను అరికడతా, సరిహద్దులు దాటి వచ్చే వారిని కఠినంగా శిక్షిస్తా” అంటూ ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ట్రంప్, అధికారంలోకి రాగానే తన మాటను నిలబెట్టుకున్నారు.వలసలను అడ్డుకునేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదంగా మారుతున్నా వెనక్కి తగ్గట్లేదు.
అయితే, ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, సాధారణంగా వలసదారులను పంపించడానికి వాడే కమర్షియల్ ఫ్లైట్స్ కాదని, ఏకంగా ఖరీదైన సైనిక విమానాలను ఎంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్.

నిజానికి వలసదారులను దేశ బహిష్కరణ చేయడానికి అమెరికా ‘ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE)’ ( Immigration and Customs Enforcement )ద్వారా నడిచే చార్టర్డ్ కమర్షియల్ ఫ్లైట్స్ వాడుతుంది.ఇవి సైనిక విమానాల కంటే చాలా చౌకైనవి.మరి ట్రంప్ సర్కార్ ఎందుకు ఇంత ఖరీదైన సైనిక విమానాలను వాడుతోంది, ఖర్చు విషయంలో చూస్తే ఒక్కో సైనిక విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చు మామూలుగా లేదు.గ్వాటెమాలకు సైనిక విమానంలో వలసదారులను పంపించడానికి ఒక్కో వ్యక్తికి దాదాపు 4,675 డాలర్లు (రూ.4 లక్షలకు పైమాటే) ఖర్చయిందట.అదే మార్గంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఫస్ట్-క్లాస్ టికెట్ ధర చూస్తే కేవలం 853 డాలర్లు (రూ.75 వేలు) మాత్రమే.అంటే ఎంత తేడా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు.

ఇక ICE విమానాల ( ICE flights )ఖర్చుతో పోలిస్తే సైనిక విమానాలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి.ICE సుమారు 135 మంది వలసదారులతో ఒక విమానాన్ని గంటకు 17,000 డాలర్ల చొప్పున నడుపుతుంది.ఒకవేళ విమానం ప్రయాణం 5 గంటలు అనుకుంటే, ఒక్కో వలసదారుడికి అయ్యే ఖర్చు సుమారు 630 డాలర్లు మాత్రమే.
కానీ, సైనిక C-17 విమానం గంటకు 28,500 డాలర్లు ఖర్చవుతుంది.భారత్‌కు విమానం చాలా దూరం ప్రయాణించింది కాబట్టి, ఇది అత్యంత ఖరీదైన దేశ బహిష్కరణ విమానాలలో ఒకటిగా నిలిచిపోతుంది.
అసలు ట్రంప్ సైనిక విమానాలను ఎందుకు వాడుతున్నారనే కదా మీ డౌట్, దీని వెనుక పెద్ద కారణం ఏమీ లేదు.కేవలం గుర్తింపు కోసమేనట.
ట్రంప్ అక్రమ వలసదారులను నేరస్తులు, పరాయి దేశస్తులు అని, అమెరికాపై దండెత్తుతున్న శత్రువులు అని పదే పదే విమర్శిస్తుంటారు.సైనిక విమానాలను వాడటం ద్వారా అక్రమ వలసలను ఆయన ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నారో చెప్పకనే చెబుతున్నారని ఆయన అభిమానులు అంటున్నారు.
అక్రమ వలసలపై తాను ఎంత కఠినంగా ఉన్నానో చూపించడానికే ట్రంప్ ఇలా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.కానీ, ట్రంప్ చర్యలను చాలా దేశాలు తప్పుబడుతున్నాయి.
కొలంబియా లాంటి దేశాలు సైనిక విమానాలలో వలసదారులను పంపడాన్ని వ్యతిరేకిస్తున్నాయి.లాటిన్ అమెరికా దేశాలు అమెరికా సైన్యాన్ని తమ సార్వభౌమాధికారానికి ముప్పుగా భావిస్తున్నాయి.
ఇన్ని విమర్శలు వస్తున్నా, ట్రంప్ మాత్రం సైనిక విమానాలను వాడటం ఆపట్లేదు.ఏది ఏమైనా, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.







