సోషల్ మీడియా ఇప్పుడు మన జీవితాల్లో ఒక భాగం అయిపోయింది.ఇక్కడ ఎన్నో విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి.
కొన్ని నవ్వు తెప్పిస్తే, కొన్ని కంటతడి పెట్టిస్తాయి.ఇప్పుడు సోమియా బజాజ్ ( Somya Bajaj )అనే భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అది చదివితే మాత్రం గుండె తరుక్కుపోతుంది.ఎందుకంటే అది మన కళ్లెదుటే జరుగుతున్న ఉద్యోగ సంస్కృతిలోని చీకటి కోణాన్ని చూపిస్తుంది.
ఇది నిజంగానే గుండెల్ని పిండేస్తుంది.
అసలు ఏం జరిగిందంటే, వాషింగ్టన్ డీ.సీలో( Washington DC ) అన్నే అనే ఒక మహిళ ఆఫీసులో పనిచేసేది.అందరితో కలివిడిగా ఉండేది, చాలా చురుకుగా ఉండేది అని సోమియా తన పోస్టులో రాసుకొచ్చింది.
కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అన్నే తన ఇంట్లో చనిపోయింది.అది కూడా ఎప్పుడు చనిపోయిందో తెలిస్తే మరింత షాకవుతారు.
ఏకంగా మూడు రోజుల తర్వాత ఆమె చనిపోయిన విషయం తెలిసింది.ఆఫీసులో అందరూ ఉన్నా, రోజూ కలిసే పనిచేస్తున్నా ఎవ్వరూ ఆమె కనిపించకపోవడాన్ని గుర్తించలేకపోయారు.
కనీసం ఒక ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కునేంత తీరిక కూడా ఎవ్వరికీ లేకపోయింది.చివరికి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి చూసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

సోమియా బజాజ్ తన పోస్టులో ఈ విషాదకరమైన సంఘటనను వివరిస్తూ.నేటి ఉద్యోగ సంస్కృతి మనుషులను ఎంత ఒంటరిగా మార్చేస్తుందో కళ్లకు కట్టినట్టు చూపించింది.ఆఫీసులో గంటల తరబడి కలిసి పనిచేస్తున్నా ఎవరికి ఎవరు పట్టనట్టు ఉంటున్నారని, పాత రోజుల్లో ఉండే టీమ్‌వర్క్, స్నేహబంధాలు( Teamwork, friendships ) ఇప్పుడు కనుమరుగైపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది.డిజిటల్ మాయలో పడి మనుషుల మధ్య అనుబంధాలు తగ్గిపోతున్నాయని ఆమె ఆవేదన నిజంగా కదిలిస్తుంది.

సోమియా పోస్ట్ పెట్టిందో లేదో క్షణాల్లో వైరల్ అయిపోయింది.వేల మంది నెటిజన్లు తమ స్పందనలు తెలియజేస్తూ కామెంట్లు పెట్టారు.చాలా మంది తాము కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నామని, ఆఫీసులో పనిచేసేవాళ్లు స్క్రీన్ వెనుక ఎవరి బాధలు పడుతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదని బాధపడ్డారు.“కనీసం ఒక మంచి మాట చెప్పి ధైర్యం చెప్పలేకపోతున్నాం, ఇది చాలా దారుణం” అని చాలామంది కామెంట్లు పెట్టారు.చాలామంది తమ తోటి ఉద్యోగులను పట్టించుకోలేకపోతున్నామని, ఇకపై అలా జరగకుండా చూసుకుంటామని కామెంట్లు పెడుతున్నారు.అన్నే మరణం నిజంగా కళ్లు తెరిపించే ఘటన.పని ఒత్తిడి, డెడ్‌లైన్‌లు, మీటింగ్‌లు ఇవే జీవితం కాదు.మనుషుల మధ్య అనుబంధాలు కూడా చాలా ముఖ్యమని ఈ సంఘటన గుర్తుచేస్తోంది.







