అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వలసదారులకు షాకిచ్చారు డొనాల్డ్ ట్రంప్.( President Donald Trump ) అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు పుట్టే పిల్లలకు జన్మత: వచ్చే యూఎస్ పౌరసత్వాన్ని( Birthright Citizenship ) నిలుపుదల చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన సంగతి తెలిసిందే.దీనిపై డెమొక్రాట్ల పాలనలో ఉన్న 22 రాష్ట్రాలతో పాటు కొన్ని వలసదారుల సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి.
దీనిపై విచారణ చేపట్టిన సియాటిల్ ఫెడరల్ కోర్ట్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేసింది.
ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు.అయితే న్యాయస్థానం తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.దీనిపై తాము కోర్టులో అప్పీల్‌కు వెళ్తామని ఆయన వెల్లడించారు.తాజాగా మరో న్యాయస్థానంలోనూ ట్రంప్‌కు చుక్కెదురైంది.

14వ రాజ్యాంగ సవరణపై ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఇచ్చే వివరణను దేశంలోని ఏ కోర్ట్ కూడా ఆమోదించదని మేరిల్యాండ్‌లోని( Maryland ) యూఎస్ ఫెడరల్ జిల్లా జడ్జి డెబోరా బోర్డ్‌మన్( District Judge Deborah Boardman ) అన్నారు.ఈ కార్యనిర్వాహక ఉత్తర్వును దేశవ్యాప్తంగా నిలుపుదల చేస్తూ ఆమె ఆదేశాలు జారీ చేశారు.పౌరసత్వాన్ని అత్యంత విలువైన హక్కుగా బోర్డ్‌మన్ పేర్కొన్నారు.ట్రంప్ కార్యానిర్వాహక ఉత్తర్వును నిలుపుదల చేస్తూ తీర్పు వెలువరించిన అనంతరం.ఈ నిర్ణయంపై అప్పీల్ చేస్తారా అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు.అయితే దీనిపై వెంటనే ఒక స్టాండ్ తీసుకునే అధికారం తనకు లేదని న్యాయవాది ఆన్సర్ ఇచ్చారు.

కాగా.అమెరికా రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలోని 14వ సవరణ కింద ఆ దేశంలో పుట్టిన పిల్లలకు జన్మత: అమెరికా పౌరసత్వం లభిస్తుంది.అనధికారిక లెక్కల ప్రకారం తాత్కాలిక వీసాలపై అమెరికాకు వచ్చిన వారు దాదాపు 1.40 కోట్ల మంది పైమాటేనని విశ్లేషకుల అంచనా.
ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కనుక అమలైతే దాదాపు 7.25 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది.ప్రస్తుతానికి కోర్డు ఈ ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ.ట్రంప్ యంత్రాంగం అప్పీల్‌కు సిద్ధమవుతుండటంతో ఏం జరుగుతుందోనని వారంతా బిక్కుబిక్కుమంటున్నారు.