సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలం ధర్మపురం సంఘ బంధం వీబికేగా 20 ఏళ్లుగా పని చేస్తూ,లక్షల రూపాయలు స్వాహా చేసిన సుంకరి చిన్న రామయ్యను వెంటనే విధులోంచి తొలగించి, ఆడిట్ నిర్వహించాలని సంఘబంధంలోని పొదుపు సంఘాల మహిళలు డిమాండ్ చేస్తున్నారు.మహిళలకు రుణాలు అందించి సంఘ బంధాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుండగా,వీబికే మాత్రం సభ్యులకు తెలియకుండా సంఘాలకు వచ్చిన రుణాలను మింగేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.
సదరు వీబికేపై తమ గ్రామ పంచాయతీ ఆఫిస్ నందు అధికారులతో ఆడిట్ నిర్వహించి,కాజేసిన సొమ్ముని రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదే విషయమై కలెక్టరేట్ జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేశామని చెబుతున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో మాకు ఎంతో ఉపయోగపడుతున్న సొమ్ముని కొన్నేళ్లుగా దొంగ లెక్కలు చెప్పి వీబికే కాజేశారని,లెక్కలు చెప్పమంటే లెక్కచేయకుండా,తనకు రాజకీయ అండదండలు ఉన్నాయని,గతంలో భూముల లెక్కలు చూడడంలో చెయ్యి తిరిగిన వాడినని,లెక్కలు చెప్పే టీచర్ కూడా నాలో ఉన్నాడని,మీకు ఎలా లెక్కలు చెప్పాలో నాకు తెలుసని బెదిరిస్తూ వస్తున్నారని వాపోతున్నారు.సంఘబంధం బాడీని కూడా లెక్కచేయకుండా నకిలీ సంతకాలు చేసి లక్షల సొమ్మును స్వాహా చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మా గ్రామంలో జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఆడిట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.