దేశంలో అతి పురాతన, పెద్ద పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కష్టకాలంలో పడింది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉనికి కాపాడుకునేందుకు తీవ్రంగా కష్టపడుతోంది.
తెలంగాణాలో ఒక మోస్తరుగా ఉన్నా ఏపీలో మాత్రం ఉనికి కాపాడుకునేందుకు తీవ్రంగా కష్టపడుతోంది.ఏపీ తెలంగాణ విభజనలో కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ముద్దాయిగా ఏపీ ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పూర్తిగా కోలుకోవడానికి రెండు మూడు దశాబ్దాలు పట్టే అవకాశం ఉంది.
ఈ విషయం కాంగ్రెస్ పార్టీ కూడా ముందే గ్రహించేసింది.ఇక్కడ ఇలా ఉన్నా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామనే అభిమానం తెలంగాణ ప్రజల్లో ఉంటుందని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతారనే అభిప్రాయపడింది.
ఏపీలో ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఒక్కొక్కరు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్నారు.
వీరితో పాటు పార్టీలో సీనియర్ నాయకులు అనుకుంటున్న డీకే అరుణతో పాటు మరికొందరు నాయకులు బీజేపీలో చేరిపోతుండడం కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది.దీనికి తోడు టి.కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ తరుణంలో సీనియర్ నాయకులు రేణుకా చౌదరి, వి.హనుమంత రావు, సర్వే సత్యనారాయణ, పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు మరికొందరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తుండడం కాంగ్రెస్ లో ఆందోళన కలిగిస్తోంది.

కేంద్రంలో అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి అనేక రాష్ట్రాల్లో పరిస్థితులు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.ఒకవైపు బలమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూనే పార్టీలో అనుకూల పరిస్థితులు ఏర్పరుచుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది.తెలంగాణాలో పార్టీ అధికారంలోకి రాకపోయినా లోక్ సభ సీట్లు సాధిస్తుంది అనే నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతోంది.
ఆ విధంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీకి గడ్డు పరిస్థితులు కల్పిస్తూ బలమైన నాయకులు అనుకున్నవారు అందరినీ తమ వైపు తిప్పేసుకుంటూ అక్కడ ప్రతిపక్షమే లేకుండా చేసుకోవాలని చూస్తుండడం కాంగ్రెస్ కి మింగుడుపడం లేదు.