తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి.అధికార కారు పార్టీతో పాటు కాషాయ పార్టీ ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నాయి.
తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సంచలన విజయాలు సాధించడంతో మంచి దూకుడు మీద ఉంది. ఈ టైంలో అధికార టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నేతలు కూడా బీజేపీ కండువాలు కప్పుకుంటున్నారు.
యమ జోరు మీద ఉన్న కాషాయ పార్టీ స్పీడుకు బ్రేకులు వేసేందుకు కారు పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలోనే కమలానికి షాక్ ఇచ్చేలా గులాబీ పార్టీయే ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది.
బీజేపీలో ఉన్న ఓ కీలక నేతను తమ పార్టీలో చేర్చుకునే ప్లాన్ వేసింది.మాజీ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు, బీసీ నేతగా గుర్తింపు ఉన్న మాజీ ఎర్ర శేఖర్ త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
బీజేపీ వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.అయితే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుజ్జగించడంతో మళ్లీ పదవిలో కొనసాగారు.
అయినా బీజేపీతో సంతృప్తిగా లేరని భావించిన ఆయనతో టీఆర్ఎస్ పెద్దలు టచ్‌లోకి వెళ్లడంతో ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ కీలక నేతలతో ఆయన మంతనాలు పూర్తయ్యాయని ఆయనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు పార్టీ నేతలు ఓకే చెప్పడంతో శేఖర్ త్వరలోనే గులాబీ గూటికి చేరడం ఖాయమని చెబుతున్నారు.ఇక ఈ నెలలోనే మంచి ముహూర్తం చూసుకొని ఎర్రశేఖర్ గులాబి గూటికి జంప్ అవుతారని తెలుస్తోంది.ఏదేమైనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కీలక నేతలు కారు పార్టీలో చేరడం కాషాయ దళానికి పెద్ద షాకే అనుకోవాలి.