‘ఎంతవారలైనా కాంతదాసులే’ అన్నారు త్యాగరాజస్వామి.ఎంతటివారైనా కాంతదాసులు అవుతారు.
ఆ పవర్ అటువంటిది.అయితే రాజకీయ నాయకుల్లో కాంతదాసులే కాకుండా ‘పుత్రదాసులు’ కూడా ఉంటారు.
అంటే పుత్రవాత్సల్యం ఎక్కవగా ఉన్నవారు, రాజకీయంగా వారిని పైకి తీసుకురావాలనుకునేవారు, పదవులు ఇవ్వాలనుకునేవారు.ఇలాగన్నమాట.
రాజకీయ నాయకుల్లో వీరి సంఖ్యే ఎక్కువ.ప్రభుత్వ పగ్గాలు ఇచ్చేందుకు వచ్చినా రాకపోయినా అధినేతలు పార్టీల పగ్గాలు మాత్రం తప్పనిసరిగా కుమారులకే (కూతుర్లు ఉన్నా కొడుకులకే ప్రాధాన్యం) అప్పగిస్తారు.
ప్రభుత్వ పగ్గాలూ అప్పగించినవారూ ఉన్నారు.యూపీలో ఎస్‌పి అధినేత ములాయం సింగ్ తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌నే సీఎం చేశారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి , ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్యనే సీఎం చేశారు.ఇప్పుడీయన తన మనసులోని మాటను చాలా స్పష్టంగా చెప్పారు.ఏమిటది? ‘నా వారసుడు నా కుమారుడే.మరెవరూ కాబోరు’ అని కుండ బద్దలు కొట్టారు.
అంటే పార్టీ పగ్గాలు కుమారుడికి తప్ప మరొకరికి ఇవ్వనని క్లారిటీ ఇచ్చారు ఈ కుచేల సంతానపతి.ఇది కొత్త విషయం కాదు.
ఆశ్చర్యకరమూ కాదు.పార్టీ కుమారుడి చేతుల్లో పెట్టకపోతేనే ఆశ్చర్యపోవాలి.
మన దేశ రాజకీయాల్లో వారసులదే హవా.జాతీయ పార్టీల దగ్గరనుంచి ప్రాంతీయ పార్టీల వరకూ ఇదే తంతు.పార్టీలు తరతరాలుగా ఒకే కుటుంబం గుప్పట్లో నలిగిపోతుంటాయి.తెలుగు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, టీడీపీల్లోనూ వారసులు రెడీగా ఉన్నారు.వారెవరో అందరికీ తెలుసు కదా…!
.