నల్లగొండ జిల్లా: అధికార మదంతో బీఆర్ఎస్ నేతలు, వారి అనుచరులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే,పోలీసులు వారికి తొత్తులుగా మారి ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఎస్పీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతయ్య అన్నారు.నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో గోడలపై చిత్రీకరించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాల్ ఫోటోలపై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, నూక కిరణ్ ఫోటోలను డిజైనింగ్ పెయింట్ తో అంటిపెట్టడంతో శుక్రవారం ఊట్కూరు గ్రామాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు.
రాజ్యాంగ బద్ధంగా ఎవరి పార్టీల ప్రచారాలు వారు చేసుకునే స్వేచ్ఛ కూడా నేడు బీఆర్ఎస్ పాలనలో లేదని,
నిండా పది మంది కూడా లేని పార్టీ కూడా ఒక పార్టీనా అంటూ బీఎస్పీ నాయకులను బీఆర్ఎస్ కార్యకర్తలు హేళన చెయ్యడం అప్రజాస్వామికమన్నారు.అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా బీఎస్పీ నాయకులపై కేసులు పెట్టి రోజుల తరబడి పోలీస్ స్టేషన్కు పిలిపించే నీచపు స్థితిలో పోలీసు వ్యవస్థ నడుస్తుందని ధ్వజమెత్తారు.
ల్యాండ్, స్యాండ్ మాఫియాతో కోట్లకు పడగేత్తి,అధికారం మదంతో రెచ్చిపోతున్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నల్లగొండ,సూర్యాపేట జిల్లాకు చెందిన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.