శుభకార్యాలకు అనుకూలం కాని ఈ ఆషాడ మాసం ఎన్నో పూజలు, వ్రతాలకి ప్రసిద్ధి అని చెప్పవచ్చు.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో బోనాల ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ బోనాల ఉత్సవాలు జూలై 11 నుంచి మొదలవుతాయి.
ఆషాడ మాసంలో వచ్చే నాలుగు ఆదివారాలు ఈ బోనాలను అమ్మవారికి సమర్పించడం అక్కడి ఆనవాయితీ.అసలు బోనాల అంటే ఏమిటి బోనం ఎందుకు చేస్తారు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం….
హైదరాబాద్ నగరంపై అమ్మవారి ఆగ్రహానికి చూపించిన దుర్ఘటన వల్ల సరికొత్త సాంప్రదాయానికి నాంది పలికింది.ఆ సంకటంలో ఉద్భవించిందిన సాంప్రదాయం ఈ బోనాల ఉత్సవం.1869 వ సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలలో ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి ప్రబలింది.చూస్తుండగానే వేలసంఖ్యలో జనాలు మృత్యువాతపడ్డారు.
ఈ విధంగా మానవజాతి పై ప్రకృతి కోపాన్ని పసిగట్టిన పెద్దవారు అమ్మవారికి బోనాలను సమర్పించి ఆమెను శాంత పరచాలని భావించారు.ఈ విధంగా అమ్మ వారిని శాంతింప చేయటం వల్ల ఎలాంటి వ్యాధులు ప్రబలవని నమ్మకం.
బోనాల ద్వారా అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఆచారం.
ఈ విధంగా ప్రతి ఏటా ఈ బోనాల ఉత్సవాలను హైదరాబాద్ నగరంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
బోనాల కోసం కొత్త కుండలను మాత్రమే ఉపయోగిస్తారు.ఈ కొత్త కుండలో అన్నం వండి ఘటంలో అంటే కుండలో ఉంచి, ఆ ఘటానికి పసుపు, కుంకుమలతో, వేపాకుతో ఎంతో అందంగా అలంకరించి పూజ చేస్తారు.
ఆ ఘటంపైన ప్రమిద వెలిగించి, వినయంగా తలపై పెట్టుకుని ఆడపడుచులు బోనం తీసుకొని అమ్మవారికి సమర్పిస్తారు.ఈ విధంగా బోనాన్ని తలపై పెట్టుకున్న వారిని సాక్షాత్తు అమ్మవారుగా భావించి భక్తులు వారి కాళ్లపై నీళ్లు పోస్తూ వారికి నమస్కరిస్తారు.
ఎంతో ఘనంగా జరుపుకునే ఈ బోనాల ఉత్సవాలు ఆషాడ మాసం తొలి ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి.మొట్టమొదటిగా బోనాల ఉత్సవాలను ఎల్లమ్మ దేవతను పూజించడంతో మొదలౌతాయి.గోల్కొండ కోటలో ఉన్న జగదంబిక ఆలయంలో ఆరంభమయ్యే ఈ బోనాల ఉత్సవాలను ఆ తర్వాత హైదరాబాద్ పాతబస్తీలోని షాలిబండలో వెలసిన అక్కన్న మాదన్న మహాకాళీ ఆలయం, పాత్రటీ ఉన్న లాల్ దర్వాజా మహాకాళి అమ్మవారు, సికింద్రాబాద్లోని ఉజయినీ మహాకాళి దేవాలయాలలో అత్యంత వైభవోపేతం నిర్వహిస్తారు.