రాజకీయాల్లో నిన్నటి హీరోలు నేడు జీరోలు అవుతారు… రాజకీయాల్లో పదవి ఉన్నంత కాలమే వెలుగుతారు.ఎప్పుడు అయితే పదవి లేకుండా రేసులో వెనకపడిపోతారో అప్పటి నుంచి వారి జీవతం రివర్స్ అయిపోతుంది.
ఒకప్పుడు రాజకీయాలను శాసించి.పదవులతో ఆడుకున్న సీనియర్ నేతలు ఇప్పుడు పదవుల కోసం యాచిస్తోన్న పరిస్థితి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పుడు రాజకీయంగా చక్రం తిప్పిన నేతలను నేడు పట్టించుకునే వారే లేరు.ఒకప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన వేణుగోపాల చారి, ముథోల్ రాజకీయాలను శాసించేవారు.
ఆయన టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లారు.అక్కడ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పని చేసి ఇప్పుడు ఎవ్వరికి పట్టని నేత అయ్యారు.

ఇక మాజీ మంత్రి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోడ జనార్థన్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు.అక్కడ ఎన్నికల్లో ఓడాక అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి.ఇక మాజీ ఎమ్మెల్యే గెడ్డం అరవింద్‌రెడ్డిని పట్టించుకునే వారే లేరు.ఆయన ఇప్పటికే మూడు పార్టీలు మారడంతో ప్రజలు కూడా ఆయన్ను లైట్ తీస్కొంటోన్న పరిస్థితి.ఇక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేందుకు సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నారట.

ఇక టీడీపీలో ఎమ్మెల్యే, జడ్పీచైర్మన్, ఎంపీ అయిన రమేష్ రాథోడ్ ఆ తర్వాత టీఆర్ఎస్‌లోకి వెళ్లి ఆ వెంటనే కాంగ్రెస్‌లోకి వెళ్లి ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసినా రెండు సార్లు కూడా ఓడిపోయారు.దీంతో రమేష్ ఈ సారి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారట.ఇక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వెంకటస్వామి కుటుంబానికి చెందిన మాజీ మంత్రి జి.
వినోద్ రాజకీయంగా వేసిన తప్పటడుగులతో ఇప్పుడు రాజకీయ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు.
ఇక ముథోల్ రాజకీయాలను శాసించిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ పలు పార్టీలు మారి పట్టించుకునే వాళ్లు లేక ఒకే ఒక్క ఛాన్స్ అంటూ వెయిటింగ్‌లో ఉన్నారు.
ఏదేమైనా ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాలను ఒకప్పుడు శాసించిన నేతలు ఇప్పుడు ఒక్క పదవి కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు.మరి వీరి కోరిక ఎప్పుడు తీరుతుందో ? చూడాలి.